UPI Payments: యూపీఐ యాప్స్ వాడేవారికి హెచ్చరిక.. ఇలాంటివి జరిగితే డబ్బులు పంపించకండి..
ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు వినూత్న పద్దతుల్లో జనాల్ని మోసం చేస్తున్నారు. యూపీఐ యాప్స్‌లో నకిలీ అకౌంట్లను సృష్టించి మోసం చేస్తున్నారు. దీంతో యూపీఐ యాప్స్‌లో ఎవరికైనా తెలియని వ్యక్తికి డబ్బులు పంపించేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. అన్నీ సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చేశాయి. ఏ సర్వీస్ కావాలన్నా మొబైల్ ద్వారా ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు లభించింది. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బ్యాంకింగ్ రంగం ముందు వరుసలో ఉంది. కస్టమర్లను ఆన్‌లైన్ ద్వారా అన్నీ సేవలు అందిస్తున్నాయి బ్యాంకులు. అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి నగదు లావాదేవీలు, క్రెడిట్ కార్డు, లోన్ సేవలు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే అందిస్తున్నాయి. దీని వల్ల బ్యాంక్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం తప్పింది. మొబైల్ నుంచి సులువుగా బ్యాంక్ సేవలన్నీ పొందుతున్నారు. ఇక యూపీఐ యాప్స్ రాకతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు మరింతగా పెరిగాయి. ఒక నిమిషంలోనే ఎవరికైనా నగదు పంపించుకోవడం లేదా స్వీకరించడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లాంటి ఫీచర్లు ఉండటంతో యూపీఐ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
డిజిటల్ లావేదేవీలు పెరిగిన క్రమంలో సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు దీనిని అడ్డాగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ సులువుగా డబ్బులు కొట్టేస్తున్నారు. బ్యాంక్ ఓటీపీలు, కేవైసీ అప్డేట్, యూపీఐ యాప్స్ పేరుతో లక్షల సొమ్ము కొల్లగోడుతున్నారు. డిజిటల్ పేమెంట్ మోసాల బారిన పడి దేశంలో లక్షల మంది తమ సొమ్మును పోగోట్టుకుంటున్నారు. దీంతో మోసాల గురించి మీకు ముందే అవగాహన ఉంటే క్రిమినల్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు. మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్లు నిర్వహించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ జాగ్రత్తలు పాటించండి
-డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు యాప్ నోటిఫికేషన్లను పరిశీలించండి
-అనుమానాస్పద యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు
-బ్యాంక్ పేరుతో వచ్చే నికిలీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
-యూపీఐ ఐడీ లేదా నెంబర్‌కు డబ్బులు పంపించేటప్పుడు అది నిజమైనదా.. కాదా అని నిర్ధారించుకోండి
-మోసపోతే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించండి
-సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి
-ఏదైనా తెలియని నెంబర్‌కు డబ్బులు పంపించే సమయంలో హెచ్చరిక సందేశాలు కనిపిస్తాయి. వాటికి పంపకండి
-ఏదైనా సంస్థకు డబ్బులు పంపుతుంటే.. సెబీ, ఆర్‌బీఐ వెబ్‌సైట్లలోకి వెళ్లి ఆ సంస్థను నిర్ధారించుకోండి




