ICICI Bank: ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్.. వాటిపై అదనంగా ఛార్జీలు..
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకు అలర్ట్. జనవరి నుంచి ట్రాన్సాక్షన్లు, రివార్డ్ పాయింట్లు, సర్వీస్ ఛార్జీలపై పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరి 15 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో క్రెడిట్ కార్డ్ వాడేవారు ముందే తెలుసుకోండి..

త్వరలో న్యూ ఇయర్ వస్తుండటంతో బ్యాంకులు తమ సర్వీసులకు సంబంధించి పలు మార్పులు చేస్తున్నాయి. బ్యాంకింగ్ సర్వీసులపై కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, యూపీఐ ఛార్జీలకు సంబంధించి కొత్త మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఐసీఐసీఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవారికి క్రెడిట్ కార్డు ఛార్జీలు, రివార్డ్ పాయింట్స్‌లో పలు మార్పులు చేసింది.
కొత్త ఛార్జీలు
క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై విధించే ఛార్జీలలో మార్పులు చేసింది. డ్రీమ్11, రమ్మీ కల్చర్, జంగ్లీ, MPL వంటి ప్లాట్‌ఫామ్‌లలో నిర్వహించే లావాదేవీలపై 2 శాతం ఛార్జీ విధించనుంది. అలాగే అమెజాన్ పే,పేటీఏం, మోబిక్విక్, ఫ్రీఛార్జ్, ఓలా మనీ లాంటి థర్డ్ పార్టీ వాలెట్లలో క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు యాడ్ చేయాలంటే చార్జీలు విధించనుంది. రూ. 5 వేల కంటే ఎక్కువ నగదు ట్రాన్సక్షన్లపై 1 శాతం ఛార్జీ వసూలు చేయనుంది. ఇక ట్రాన్స్‌పోర్టేషన్ మర్చంట్ కేటగిరీ కోడ్ రూ.50 వేలు దాటిన ట్రాన్సాక్షన్లకు 1 శాతం ఛార్జీ విధించనుంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ నుంచి వీటిని అమల్లోకి తీసుకురానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
క్రెడిట్ కార్డు బిల్లు
ఇక క్రెడిట్ కార్డ్ బిల్లును బ్యాంక్‌కు వెళ్లి చెల్లించాలనుకుంటే.. ప్రతి చెల్లింపు లావాదేవీకి రూ.150 వసూలు చేస్తారు. ఇక విదేశాల్లో భారత కరెన్సీలో నిర్వహించే ప్రతి లావాదేవీకి లేదా దేశంలోనే విదేశీ దేశంలో నమోదు చేసుకున్న వ్యాపారులతో భారత కరెన్సీలో నిర్వహించే లావాదేవీలకు DCC రుసుము వర్తిస్తుంది. ప్రస్తుత డీసీసీ రుసుం 1 శాతం ఉండగా.. దీనిని 3.50 శాతంకు పెంచింది. జనవరి 15 నుంచి ఇది అమల్లోకి రానుంది.
సినిమా టికెట్లపై ఆఫర్లు
ఒక త్రైమాసికంలో రూ. 25 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే బుక్ మై షో ఆఫర్‌లతో మీకు ఇష్టమైన సినిమాలు, ఈవెంట్‌లను ఆస్వాదించవచ్చు. ఇక మీరు వ్యాపారి కేటగిరీ కోడ్‌ల కింద క్రెడిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై రికార్డ్ పాయింట్లు వస్తాయి. నెలకు రూ.10 వేల వరకు ఖర్చు చేసే లావాదేవీలపై రికార్డ్ పాయింట్లు అందిస్తారు. ఇది ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానుందని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది.




