Bank Loans: సిబిల్ స్కోర్ ఎక్కువున్నా మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదా..? మీరు ఈ తప్పులు చేసి ఉండొచ్చు..
ఈ రోజుల్లో సొంతింటి నిర్మాణం కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటున్నారు. హోమ్ లోన్ లభించడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌తో పాటు మీ ఆదాయం, సిబిల్ స్కోర్ అన్నీ బాగుండాలి. ఒకవేళ అప్పటికీ ఇవ్వకపోతే..

సొంతిల్లు కట్టుకోవాలనేది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఓ డ్రీమ్. ఒక మంచి ఇల్లు కట్టుకుని ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కలలు కంటూ ఉంటారు. అందుకోసం సంపాదించిన సొమ్మును దాచుకుంటూ ఉంటారు. ముడిసరుకు ధరలు, కూలీల ఖర్చులు పెరిగిన ప్రస్తుత తరుణంలో సొంతిల్లు అనేది సామాన్యుడికి భారంతో కూడుకున్న పనే. ఇందుకోసం లక్షలకు లక్షలు ఖర్చు అవ్వుతాయి. సామాన్యుడు దాచుకున్న సొమ్ము ఇందుకు సరిపోదు. దీంతో తెలిసినవాళ్ల నుంచో లేదా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని కొత్త ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ భారీగా ఆఫర్ చేస్తున్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల్లో తీర్చుకునే అవకాశం ఉండటంతో హోమ్ లోన్ ఎక్కువమంది తీసుకుంటూ ఉంటారు.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా..?
సిబిల్ స్కోర్‌ను బట్టి బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తూ ఉంటాయి. సిబిల్ స్కోర్ బాగా తక్కువగా ఉంటే రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావు. ఇక సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. దీంతో మినిమం 700 ప్లస్ క్రెడిట్ స్కోర్ ఉంటే కానీ బ్యాంకులు హోమ్ ఇవ్వవు.
ఆదాయ వనరులు
ఇక బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు మీ ఆదాయ వనరులను కూడా చూస్తాయి. మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఉందా.. ఏడాది సంపాదన ఎంత ఉంది. భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశముందా.. ఒకవేళ లోన్ మంజూరు చేస్తే క్రమం తప్పకుండా చెల్లించగలడా.. అనే విషయాలు చూస్తాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. మీకు ఆదాయం సరిగ్గా లేకపోతే హోమ్ లోన్ మంజూరు చేయవు.
తరచుగా కంపెనీలు మార్పు
మీరు తరచుగా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీగా ఉద్యోగం మారుతున్నా లేదా ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నా బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపవు. ఈ అంశాలు మీపై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఇక ఆదాయం సరిగ్గా లేని రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లోన్లు ఇవ్వవు. ఇక ఆదాయం ఎక్కువగా ఉన్నా.. ఐటీ రిటర్న్స్‌లో పన్ను ఎగవేత కంటే తక్కువ ఆదాయం చూపించినా హోమ్ లోన్ ఇవ్వరు.
క్రెడిట్ స్కోర్ ఉన్నా ఇవ్వకపోతే..
ప్రస్తుతం ఉన్న ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. అన్ సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువగా ఉండకూడదు. ఇక మీ ఆదాయానికి మించి ఖర్చులు చేయకండి. క్రెడిట్ కార్డుల జోలికి అసలు వెళ్లకూడదు. క్రెడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫాలో అవ్వడం వల్ల మీకు బ్యాంకులు లోన్లు మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.




