Bonalu: ఈ ఏడాది ఘనంగా బోనాల జాతర.. జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు
Bhagyanagar Bonalu: తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే బోనాల జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 25న సమావేశం నిర్వహించన్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం ఆషాడ బోనాలను ఘనంగా...
తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే బోనాల జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 25న సమావేశం నిర్వహించన్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని అన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
జులై 11 నుంచి బోనాల జాతర…
భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలుత గోల్కొండ బోనాలతో జంట నగరాల పరిథిలో ఉత్సవాలు ఘనం షురూ అవుతాయి. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయామన్నారు.
కానీ ఈ ఏడాది జులై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాద్ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నాలని ఆలయ కమిటీ తమ ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు వచ్చే నెల 25, 26 తేదీల్లో జరుగుతాయి. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. 26న ఏనుగుపై ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.