Baba Vanga: 2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు..
ప్రతి ఏడాది చర్చనీయాంశమయ్యే బాబా వంగా 2026 అంచనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బల్గేరియన్ అంధురాలు దశాబ్దాల క్రితమే 2026లో గ్రహాంతరవాసుల రాక, AI ఆధిపత్యం, ప్రపంచ యుద్ధ మేఘాలు, భారీ ప్రకృతి విలయాలు సంభవిస్తాయని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రష్యా నుండి కొత్త ప్రపంచ నాయకుడు ఉద్భవిస్తాడంటూ సంచలన విషయాలు వెల్లడించారు.

ప్రతి ఏడాది ముగిసే సమయానికి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యే పేర్లలో బాబా వంగా ఒకరు. బల్గేరియాకు చెందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త దశాబ్దాల క్రితమే చెప్పిన అంచనాలు నిజమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెపై అపారమైన నమ్మకం ఏర్పడింది. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న అంచనాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ఎవరీ బాబా వంగా?
1911లో జన్మించి 1996లో మరణించిన బాబా వంగాను బాల్కన్ల నోస్ట్రాడమస్ అని పిలుస్తారు. చెర్నోబిల్ విపత్తు, 9/11 దాడులు, సోవియట్ యూనియన్ పతనం వంటి ప్రధాన సంఘటనలను ఆమె ముందే ఊహించారని నమ్ముతారు. 2026 కోసం వైరల్ అవుతున్న ఆమె అంచనాలు గతంలో కంటే మరీ భయంకరంగా ఉన్నాయి.
నవంబర్ 2026న గ్రహాంతరవాసుల రాక?
బాబా వంగా అంచనాల్లో అత్యంత నాటకీయమైనది గ్రహాంతరవాసుల సందర్శన. 3I/ATLAS అని పిలువబడే ఒక రహస్య అంతర్ నక్షత్ర వస్తువు 2026 నవంబర్‌లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే జూలై 2025లో ఒక వింత వస్తువును గుర్తించడంతో ఇది గ్రహాంతర నౌక కావచ్చని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు
యూరప్, ఆసియా ఖండాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుతాయని బాబా వంగా సూచించినట్లు తెలుస్తోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం మరియు భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి, ప్రపంచ దేశాల పొత్తులు పూర్తిగా మారిపోతాయని, కొత్త శక్తి కేంద్రాలు ఏర్పడతాయని ప్రచారం జరుగుతోంది.
మానవులపై AI ఆధిపత్యం
సాంకేతికత మానవ నియంత్రణను దాటిపోతుందని ఆమె హెచ్చరించినట్లు అనువాదకులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న కృత్రిమ మేధస్సు ప్రస్థానం 2026 నాటికి మనుషులపై ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుతుందని, ఆటోమేషన్ వల్ల ఉద్యోగ విప్లవం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు – వాతావరణ మార్పు
నేటి శాస్త్రవేత్తల హెచ్చరికలకు అనుగుణంగానే బాబా వంగా అంచనాలు కూడా ఉన్నాయి. 2026లో భారీ భూకంపాలు, వరదలు, సునామీలు, తీవ్రమైన వేడి తరంగాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను అతలాకుతలం చేస్తాయని ఆమె హెచ్చరించారు.
రష్యా నుండి ప్రపంచ నాయకుడు
రష్యా నుండి ఒక బలమైన నాయకుడు ప్రపంచ శక్తిగా ఎదుగుతారని ఆమె అంచనా వేసినట్లు సోషల్ మీడియా సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుత ప్రభావాన్ని చూస్తుంటే ఈ అంచనా నిజమవ్వచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
బాబా వంగా అంచనాలు అధికారికంగా ఎక్కడా లిఖితపూర్వకంగా లేవు. కేవలం ఆమె అనుచరులు, భక్తులు చెప్పిన మాటల ఆధారంగానే ఇవి ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.








