- Telugu News Photo Gallery Spiritual photos Job Astrology 2025: These zodiac signs to get jobs soon due to strong planet in 10th house
Udyoga Yoga: దశమ స్థానంలో అనుకూల గ్రహం.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా..!
సమీప భవిష్యత్తులో ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉందా? నిరుద్యోగ సమస్య నుంచి ఎప్పటికైనా బయటపడతామా? మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉందా? విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా? ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది? ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానాన్ని, దశమాధిపతిని బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దశమ స్థానం, దశమ స్థానాధిపతిని బట్టి కొన్ని రాశులవారికి ఒకటి రెండు నెలల్లో ఉద్యోగం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభ వార్తలు వినడం జరుగుతుంది. అవిః వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీనం. మిగిలిన రాశులకు కొద్దిగా నిరీక్షణ తప్పకపోవచ్చు.
Updated on: Aug 12, 2025 | 1:10 PM

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు, లాభ స్థానంలో దశమ స్థానాధిపతి శని బలమైన సంచారం చేస్తున్నందువల్ల నిరుద్యోగులకు అతి త్వరలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. సీనియర్లకు పదోన్నతులతో పాటు జీత భత్యాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల, దశమాధిపతి గురువు మిథున రాశిలోనే ఉన్నందువల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కూడా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. సీనియర్లకు పదోన్నతులు కలిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. సాధారణంగా ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు అక్టోబర్ లోగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. స్థాన చలనాలకి అవకాశం ఉంది. ఇప్పట్లో ఉద్యోగం మారకపోవచ్చు.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో రవి, బుధుల యుతితో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల నిరుద్యో గులకు త్వరలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు లభించే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి సంచారం బాగా అనుకూలంగా ఉంది. దశమాధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నందువల్ల ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అక్టోబర్ లోగా ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది.

మీనం: ఈ రాశికి దశమ స్థానం మీద గురు, శుక్రుల దృష్టి పడడం, దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులకు అతి త్వరలో అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. వీరు ఉద్యోగపరంగా స్థిరపడడంతో పాటు వీరికి ఉద్యోగంలో శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు.



