Kushboo: రచ్చ రాజేస్తున్న డీఏంకే నేత వ్యాఖ్యలు.. సీఏం స్టాలిన్ స్పందించాలన్న ఖుష్బూ.. ఎంత వరకైనా వెళ్తానంటూ సవాల్..
డీఎంకే నేత సైదాయ్ సాదిక్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్టాలిన్ స్పందించకుండా ఉంటే..

డీఎంకే నేత సైదాయ్ సాదిక్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్టాలిన్ స్పందించకుండా ఉంటే అర్థం ఏమిటని, ఆయన మౌనం దేనికి సంకేతం అని ఆమె నిలదీశారు. బీజేపీలోని ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి రఘురామ్‌ను ఉద్దేశిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు అంటూ సైదాయ్ సాదిక్ వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన తరపున ఎంపీ కనిమొళి క్షమాపణ కూడా చెప్పారు. ఈ విషయంలో డీఎంకే నేతను వదిలేది లేదని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళతానని హెచ్చరించారు ఖుష్బు. సైదాయ్ సాదిక్ మహిళలను కించపర్చారని, ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాలని ఖుష్బూ డిమాండ్ చేశారు. సైదాయ్ సాదిక్ పై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ నుంచి ఎవరైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సీఎం ఇలాగే సైలెంట్‌గా ఉంటారా అంటూ ఖుష్బు ప్రశ్నించారు.
తనకు 22, 19 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటున్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లు ఏమనుకుంటారని ఖుష్బూ పేర్కొన్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మహిళా నేతలను ‘ఐటమ్’లుగా పేర్కొంటూ డీఎంకే నేత సైదాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందుతున్న మహిళలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ రాజేశాయి. ఈ రెండింటిపై డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, స్టాలిన్ సోదరి కనిమొళి స్పందించారు. పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని ఆమె చెప్పారు.
సైదాయ్ సాదిక్ క్షమాపణలు..
బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూకు డీఎంకే నేత సైదాయ్ సాదిక్ క్షమాపణ చెప్పారు. బీజేపీలోని ఖుష్బూతో సహా పలువురు నటీమణులను కించపరిచేలా సైదాయ్ సాదిక్ మాట్లాడారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఖుష్బూ ఓ ట్వీట్‌ను ఎంపీ కనిమొళికి ట్యాగ్ చేశారు. దానికి ఆమె క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సాదిక్ కూడా ఖుష్బూకు ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని వివరణ ఇచ్చారు. అయినా ఖుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..



