Indo-Chinese Relation: సామరస్య ప్రకటనలొకవైపు.. ఆధిపత్య పోరు ఇంకోవైపు.. అయితేనేం బోర్డర్ వివాదమే కీలకం
వాస్తవాధీన రేఖ మొదలుకొని చాలా అంశాలలో చైనా, ఇండియా మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దాంతో ఇరు దేశాల రిలేషన్ విషయంలో భిన్నమైన సంకేతాలు తరచూ వెలువడుతూ వుంటాయి.
Indo-Chinese Relation: ఇండియా, చైనా మధ్య సత్సంబంధాల విషయంలో తరచూ విశ్లేషణలు మారుతూ వుంటాయి. ఒక్కో విశ్లేషణ మధ్య పరస్పర వైరుద్యాలు కూడా కనిపిస్తూ వుంటాయి. వాస్తవాధీన రేఖ మొదలుకొని చాలా అంశాలలో చైనా, ఇండియా మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దాంతో ఇరు దేశాల రిలేషన్ విషయంలో భిన్నమైన సంకేతాలు తరచూ వెలువడుతూ వుంటాయి. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చైనా కమ్యూనిస్టు పార్టీ ఫారిన్ అఫైర్స్ కమిషన్ ప్రెసిడెంటు వాంగ్ యీ ఈ మధ్యనే సౌతాఫ్రికాలో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో రెండు దేశాల రిలేషన్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలే వెలువడ్డాయి. కరోనా కాలం అంటే 2020 నుంచి వాస్తవాధీన రేఖ (LAC)పై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఇది రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసిందని అజిత్ దోవల్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. దానికి కౌంటరిచ్చిన వాంగ్ యీ తమ దేశం ఎవరి మీదా ఆధిపత్యం చలాయించాలనుకోవడం లేదని కామెంట్ చేశారు. కానీ చైనా చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నది అందరికీ తెలిసిందే. గత సంవత్సరం నవంబరులో ఇండొనేసియాలోని బాలిలో జీ-20 సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. నేతలిద్దరూ ద్వైపాక్షిక సంబంధాలను స్థిరపరచాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నారని మోదీ సర్కార్ కూడా ఉటంచింది. కానీ ఇలాంటి ప్రకటనలను పూర్తిగా విశ్వసించ లేము. ఎందుకంటే ఇరు దేశాల సరిహద్దులో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. సరిహద్దు సమస్య తీవ్రత దృష్యా రెండు దేశాల మధ్య సామరస్యత నెలకొంటుందన్న ఆశలు నీరుగారుతున్నాయి. మొన్నటి ఏప్రిల్ 23న ఇండియా, చైనా మిలిటరీ దళాల కోర్ కమాండర్ల చర్చల్లో సరిహద్దు నుంచి తన సేనలను ఉపసంహరించడానికి చైనా సుతరామూ అంగీకరించలేదు. ఆనాటి భేటీ తర్వాత జరగాల్సిన 19వ విడత చర్చలకు ఇంకా తేదీలే ఖరారు కాలేదు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బంకర్లు, రాడార్, క్షిపణి, ఫిరంగి స్థావరాలను నిర్మిస్తూనే ఉంది. ఈ మధ్య మళ్ళీ కొత్తగా రహదారులు, హెలిపాడ్లు, వంతెనలు, ఇంటర్నెట్ తదితర కమ్యూనికేషన్ వసతులను నెలకొల్పుతోంది. సివిల్, మిలిటరీ ప్రయోజనాలు రెండింటికీ ఉపకరించే షియావోకాంగ్ గ్రామాలను బోర్డర్‌కు దగ్గరలో నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న వైమానిక స్థావరాలను మరింత బలోపేతంచేసి, కొత్తగా మరో ఏడెనిమిది స్థావరాలను, హెలిపాడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ దేశాల నేతలు, మంత్రులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నంత మాత్రాన ఉద్రిక్తతలు తొలగి స్నేహం, సయోధ్య నెలకొంటాయని అనుకోలేము.
రూపాయి బలోపేతానికి భారత్ కృషి
బోర్డర్‌లో ఉద్రిక్తత సమసిపోనంత వరకు ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవు. అసలు ఇండియా, చైనా సరిహద్దులను ఇంతవరకు కచ్చితంగా గుర్తించనే లేదని, బ్రిటిష్ వలస పాలకులు గీసిన మెక్‌మహాన్ రేఖే ఇప్పటికీ సరిహద్దుగా చలామణీ అవుతోందనే వాదన కూడా ఉంది. బోర్డర్ వివాదం ఒక కొలిక్కి రాకపోవడానికి ఇదే మూలకారణమని చాలా మంది అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అంటూ వుంటారు. గతంలో మెక్‌మహాన్ రేఖను సరిహద్దుగా అంగీకరించినందుకు బదులుగా అరుణాచల్ ప్రదేశ్‌ను తనకు వదలుకోవాలని చైనా భారత్‌కు కండీషన్ పెట్టిందన్న వాదన కూడా వుంది. చైనాలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా రవాణా అనుసంధానాన్ని అరుణాచల్‌ప్రదేశ్ గుండా నిర్మించాలన్నది చైనా ప్లాన్. అందుకే ఆ ప్రాంతం తనదేనంటూ మ్యాపులు ప్రచురిస్తూ ఉంటుంది. మనదేశం అరుణాచల్ ప్రదేశ్‌ను వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. మిలిటరీ పరంగా ఇండియా, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఆర్థికపరంగా, దౌత్యపరంగా మంచి సంబంధాలే కొనసాగుతూ వచ్చాయి. దౌత్య స్థాయిలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, జీ-20 వేదికల్లో భారత్, చైనా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ వేదికల్లోనూ సరిహద్దు ఘర్షణల ప్రస్తావన వచ్చినట్లు రెండు ప్రభుత్వాల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. చాలా ఏళ్ళపాటు చైనాయే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. 2021-22తో పోలిస్తే 2022-23లో భారత్-చైనా వాణిజ్యం తగ్గి, భారత్-అమెరికా వాణిజ్యం పెరిగింది. సరిహద్దు సమస్య పరిష్కారమైతే తప్ప చైనాతో వ్యాపార వృద్ధికి అవకాశమే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఇంకోవైపు ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనాలతో ఏర్పడిన ‘బ్రిక్స్’ కూటమి… ఆగస్టు శిఖరాగ్ర సమావేశంలో డాలర్‌కు పోటీగా ఉమ్మడి కరెన్సీ మీద కసరత్తు చేస్తున్నాయని వార్తలొచ్చాయి. పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇండియా రూపాయి బలోపేతానికి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. పలు దేశాలతో నేరుగా రూపాయల్లో వాణిజ్యం చేసుకునేందుకు, రూపే కార్డుల వినియోగానికి ప్రయత్నాలు చేస్తోంది. సగం గల్ఫ్ దేశాలు ఈ మేరకు ఇండియాతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ జులై నెలలోనే విస్పష్టంగా ప్రకటించారు కూడా. రష్యా కూడా ఇప్పటికిప్పుడు ఉమ్మడి కరెన్సీని తీసుకురావడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించింది. తన సరిహద్దులో చైనా అతిక్రమణలు సమసిపోనంతవరకు భారత్ ఉమ్మడి కరెన్సీకి కలిసివచ్చే అవకాశం లేదు. బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ పరోక్షంగా బీజింగ్ ఆర్థిక ఆధిపత్యానికే తోడ్పడవచ్చు. దీన్ని నివారించడానికి భారత్, అమెరికాలు ఆర్థిక బంధాన్ని బలపరచుకుంటున్నాయి.
ఆధిపత్య పోరులో దూకుడు
హిమాలయాల్లో, దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుకు బ్రేక్ వేయడానికి ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు దేశాలు వ్యాపార, సైనిక, సాంకేతిక పరంగా సంబంధాలను బలపరచుకొంటున్నాయి. తేజస్ యుద్ధ విమానాల్లో అమర్చేందుకు అమెరికన్ జీఈ ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేయడానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. చైనా నుంచి అమెరికా, జపాన్‌లు తరలిస్తున్న పరిశ్రమల్లో కొన్ని భారత్‌కు రానున్నాయి. సెమీ కండక్టర్ల తయారీలో స్వావలంబన సాధనకు అమెరికా, తైవాన్, జపాన్‌లు భారత్‌కు తోడ్పడగలవు. ఏతావతా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోకుండా భారత్, చైనాలు ఆర్థిక, రాజకీయ బంధాలను బలోపేతం చేసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచంలో మేటి శక్తులుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఇండియా, చైనా బోర్డర్ వివాదాలలో వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం సిద్దంగా లేవు. కాబట్టి, రెండు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు సమీప భవిష్యత్తులో సమసిపోతాయనుకోవడం కచ్చితంగా భ్రమే అవుతుంది. చైనాకు దీటుగా సరిహద్దుల్లో రహదారులు, వంతెనల వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. 2014లో ఇందుకు 4 వేల కోట్ల డాలర్లు వెచ్చించిన ఇండియా ..ఇప్పుడు ఆ వ్యయాన్ని ఏకంగా 14 వేల కోట్ల డాలర్లకు పెంచిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. పట్టు సడలని వ్యవహారాలతో రెండు దేశాలు తమతమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. అయితే గతంలో చైనా పట్ల ఇండియా వైఖరి ఇపుడు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా 2014 తర్వాత చైనాకు ధీటుగా ఎదగడానికి భారత్ భిన్న మార్గాలలో ప్రయత్నిస్తోంది. అందుకు చైనాను వ్యతిరేకించే పలు పాశ్చాత్య దేశాలతోపాటు చైనాతో సన్నిహితంగా వుండే రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా ఇండియాకు సహకరిస్తున్నాయనే చెప్పాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..