ఈ బిల్లు ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదు.. ఎవరికీ అన్యాయం చేయదుః ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూనే, దేశ ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూనే, దేశ ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ఆయన స్పష్టం చేశారు.
గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల విషయంలో అనేక సాకులు చెబుతూ కాలయాపన చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ బిల్లును ఎవరూ రాజకీయ త్రాసులో తూచవద్దని, ఇది జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని ఆయన విజ్ఞప్తి చేశారు. “మనం మహిళలకు ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఉండకూడదు, ఇది వారి హక్కు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి మనకు లభించిన గొప్ప అవకాశం ఇది” అని మోదీ పేర్కొన్నారు.
ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని తనదైన శైలిలో స్పందించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వచ్చే కీర్తి ప్రతిష్టలు తనకేమీ అవసరం లేదని, ఆ ఘనత అంతా ప్రతిపక్షాలకే దక్కుతుందని ఆయన అన్నారు. “ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, అందరి ఫోటోలను ప్రచురిస్తూ ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ఘనతను మీరే తీసుకోండి, కానీ మహిళలకు న్యాయం జరగనివ్వండి.” అని ప్రధాని మోదీ కోరారు.
రిజర్వేషన్ల అమలులో జాప్యంపై స్పందిస్తూ, 2024లో సాంకేతిక కారణాల వల్ల ఇది సాధ్యపడలేదని, అయితే 2029 నాటికి దీనిని అమలు చేయడానికి తగిన సమయం ఉందని ప్రధాని వివరించారు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయడం దేశానికి మంచిది కాదని, కాలం మన నుండి త్వరితగతిన నిర్ణయాలను కోరుతోందని ఆయన హెచ్చరించారు.
ఈ బిల్లు ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం చేయదని ప్రధాని హామీ ఇచ్చారు. ‘నారీ శక్తి వందన్ చట్టం’ ద్వారా దేశవ్యాప్తంగా నెలకొన్న ఆనంద వాతావరణాన్ని కాపాడుతూ, ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని ఆయన సభను కోరారు. ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తే రాజకీయంగా తనకే లాభమని, కానీ అందరూ సహకరిస్తే అది దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
