AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నకిలీ విత్తన ఫ్యాక్టరీపై స్వయంగా దాడి చేసిన వ్యవసాయ మంత్రి.. బయటపడ్డ భారీ స్కామ్..!

రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టయింది. అమాయక రైతులను నిలువునా ముంచుతున్న ఈ ముఠా ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రైతుల నుంచి అందిన వరుస ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు.

నకిలీ విత్తన ఫ్యాక్టరీపై స్వయంగా దాడి చేసిన వ్యవసాయ మంత్రి.. బయటపడ్డ భారీ స్కామ్..!
Rajasthan Agriculture Minister Kirodi Lal Meena
Balaraju Goud
|

Updated on: May 26, 2026 | 1:02 PM

Share

రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టయింది. అమాయక రైతులను నిలువునా ముంచుతున్న ఈ ముఠా ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రైతుల నుంచి అందిన వరుస ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి జైపూర్ శివార్లలోని చోము సమీపంలో గల ‘బాలాజీ ఆగ్రో కంపెనీ’పై ఆయన ఆకస్మిక దాడి నిర్వహించారు.

మంత్రి కిరోడీ లాల్ మీనా నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వేరుశెనగ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నాణ్యత లేని సాధారణ గింజలను బ్రాండెడ్ కంపెనీల సంచుల్లో ప్యాక్ చేస్తూ మార్కెట్లోకి తరలించేందుకు సిద్ధం చేసిన భారీ స్టాక్‌ను చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు అక్కడ లభ్యమైన భారీ నకిలీ విత్తనాల నిల్వలను తక్షణమే సీజ్ చేశారు. “రక్తమాంసాలు ధారపోసి పంటలు పండించే రైతులను మోసం చేస్తే సహించేది లేదు. నకిలీ విత్తనాలతో అన్నదాతల జీవితాలతో ఆటలాడుకుంటే ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తాం.” అని వ్యవసాయ మంత్రి కిరోడీ లాల్ మీనా హెచ్చరించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన బాలాజీ ఆగ్రో కంపెనీ యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను, అధికారులను ఆదేశించారు. సీజ్ చేసిన విత్తన శాంపిల్స్‌ను నిపుణుల ల్యాబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి విచారణను మరింత వేగవంతం చేయనున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విత్తన మార్కెట్లు, డీలర్ల దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నకిలీ విత్తన ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్‌వర్క్ మొత్తాన్ని లాగేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us