AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత..

అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షిలు బల్హారా భార్య ముస్కాన్ బల్హారా రోహ్‌తక్‌లోని అత్తగారి ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరివేసుకుని మృతి చెందడం సంచలనం సృష్టించింది. ముస్కాన్ తండ్రి ఫిర్యాదు మేరకు షిలు బల్హారా, అతని తల్లిదండ్రులు, సోదరుడిపై వేధింపులు/హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత..
Kabaddi Player Wife
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2026 | 6:22 PM

Share

అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షిలు బల్హారా భార్య అయిన ముస్కాన్ బల్హారా (23) ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపింది. ముస్కాన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రోహ్‌తక్‌లోని బహు అక్బర్‌పూర్ గ్రామంలోని తన అత్తగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో సంచలనంగా మారింది. షీలు నివాసంలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ముస్కాన్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు.

హరియాణాలోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్‌కు.. హరియాణా ఆలా చీతాగా పేరొందిన కబడ్డీ స్టార్ షీలు బల్హారాకు డిసెంబర్ 8, 2023న వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల వయసున్న హార్దిక్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం సమయంలో ముస్కాన్ ఉన్న గది తలుపులు ఎంతసేపటికీ తెరవకపోవడంతో.. కుటుంబసభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే ముస్కాన్ పుట్టింటి వారు అక్కడకు చేరుకుని, షీలు బల్హారా ఇంటి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు

ముస్కాన్ తండ్రి సుఖ్‌బీర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కూతురిని షీలు, అతని కుటుంబ సభ్యులు నిత్యం వేధింపులకు గురిచేసేవారని, ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందే ముస్కాన్ తనకు ఫోన్ చేసి, అత్తమామలు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు.

తదనంతరం, తండ్రి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు రోహ్‌తక్ పోలీసులు కబడ్డీ ప్లేయర్ షీలు బల్హారా, అతని తండ్రి, తల్లి, సోదరుడిపై హత్య,వేధింపుల కింద కేసు (FIR) నమోదు చేశారు. పోలీసులు షీలును విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు.

సోషల్ మీడియాలో రీల్:

ఘటనకు ఒక రోజు ముందే ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ పాడిన పాటకు రీల్ చేసి అప్‌లోడ్ చేయడం గమనార్హం. చాలా సంతోషంగా రీల్ చేసిన ఆమె, మరుసటి రోజే ఇలా శవమై కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. రోహ్‌తక్ పీజీఐఎమ్‌ఎస్ (PGIMS) ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రోహ్‌తక్ ఎస్పీ గౌరవ్ రాజ్‌పురోహిత్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, సంఘటనా స్థలంలో ఒక ఆత్మహత్య లేఖ కూడా లభ్యమైనట్లు తెలిసింది. అయితే, పోలీసులు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. బహు అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) జస్బీర్, దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే తెలిపారు.

ఇలాంటి మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు విలువైన ప్రాణాలు తీసుకోవద్దు.. మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉచిత హెల్ప్‌లైన్ నెంబర్ ఐకాల్ 022-25521111కు ఫోన్ చేసి.. సలహాలు, సహాయం పొందవచ్చు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us