2027లో రూ.3 లక్షలా..? బాబా వంగా ‘బంగారం’ అంచనాలు వైరల్.. అసలు నిజమేంటి?
అంతర్జాతీయంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి.. ఇప్పటికే.. పది గ్రాముల ధర లక్షన్నర ఉంది.. ఈ క్రమంలోనే.. 2027లో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలకు చేరుతుందంటూ బాబా వంగా పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం సంచలనంగా మారింది.

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలలో శరవేగంగా దూసుకెళ్తున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షన్నర మార్క్ దాటింది.. ఈ నేపథ్యంలో 2027 నాటికి పసిడి ధరలు మరింతగా పెరగనున్నాయంటూ సోషల్ మీడియాలో బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ భవిష్యవేత్త బాబా వంగా (Baba Vanga) పేరుతో ఓ ప్రచారం వైరల్‌గా మారింది. మరోవైపు, సోషల్ మీడియా వదంతులను పక్కనబెడితే.. గ్లోబల్ ఆర్థిక సంస్థలైన జేపీ మోర్గాన్, యూబీఎస్ కూడా రాబోయే సంవత్సరాల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేయడం సంచలనంగా మారింది.
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం..
25% నుండి 40% పెరుగుదల: రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం లేదా తీవ్రమైన నగదు కొరత ఏర్పడటంతో, బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గి పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తి అయిన బంగారం వైపు మొగ్గుచూపుతారని ప్రచారం జరుగుతోంది.
తులం రూ. 2.82 లక్షలు?: ఈ భవిష్యవాణి ప్రకారం.. భారత్‌లో 10 గ్రాముల (24 క్యారెట్ల) పసిడి ధర రూ. 2.10 లక్షల నుండి ఏకంగా రూ. 2.62 లక్షలు – రూ. 2.82 లక్షల స్థాయికి చేరవచ్చని నెట్టింట ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలు నిజం ఏంటి?
బాబా వంగా నిజంగానే బంగారం ధరలపై ఈ రకమైన అంచనాలు వేశారనేందుకు ఎలాంటి అధికారిక, రాతపూర్వక ఆధారాలు లేవు.. బాబా వంగా తన భవిష్యవాణులను ఎక్కడా స్వయంగా నమోదు చేయకపోవడంతో, ఆమె పేరుతో ప్రచారంలో ఉన్న ఈ గణాంకాలన్నీ కేవలం సోషల్ మీడియాలో జోడించిన ఊహాగానాలు మాత్రమే. కాబట్టి ఈ వైరల్ వార్తలను ప్రామాణికమైన మార్కెట్ అంచనాలుగా భావించవద్దని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అధికారిక ఆర్థిక సంస్థల అంచనాలు:
బాబా వంగా ప్రచారాన్ని పక్కనబెడితే.. ప్రముఖ గ్లోబల్ ఆర్థిక సంస్థలు కూడా రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి:
జేపీ మోర్గాన్ (JPMorgan): భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా 2026 చివరి నాటికి ఔన్సు బంగారం $6,000 డాలర్లకు, 2027 నాటికి $6,300 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది.
యూబీఎస్ (UBS): 2027 తొలి అర్ధభాగంలో ఔన్సు బంగారం $5,000 డాలర్ల మార్కును తాకవచ్చని విశ్లేషించింది.
సోషల్ మీడియాలో బాబా వంగా పేరుతో వచ్చే అనధికారిక వదంతులు లేదా ఊహాగానాలను నమ్మకుండా, గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల విశ్లేషణలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాబా వంగా ఎవరు..?
బాబా వంగా అసలు పేరు.. వాంగెలియా పాండేవా దిమిత్రోవా.. ఆమె 1911లో బల్గేరియాలో జన్మించారు. మూలికా వైద్యురాలిగా, భవిష్యవాణి చెప్పే మహిళగా ప్రసిద్ధి చెందారు. 12 ఏళ్ల వయసులో సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత ఆమె చూపును కోల్పోయారని.. ఆమె చెప్పిన అంచనాల్లో సుమారు 85 శాతం నిజమయ్యాయని ప్రచారం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
