ICC Rule Changes: క్రికెట్ ఫ్యాన్స్‌కు అప్డేట్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి ఐసీసీ కొత్త రూల్స్
ICC Rule Changes: ఐసీసీ అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త ప్లేయింగ్ కండిషన్స్ అమలుచేస్తోంది. మ్యాచ్‌ల్లో సమయాన్ని వృథా చేసే బ్యాటర్లకు 5 పరుగుల పెనాల్టీ విధించనున్నారు. పగటి పూట జరిపే టెస్టుల్లో బ్యాడ్ లైట్ సమస్య తగ్గించేందుకు పింక్ బాల్ ట్రయల్స్‌తో పాటు రనౌట్, వైడ్ రూల్స్‌ను సవరించారు.

ICC Rule Changes: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మ్యాచ్‌లను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పలు కీలక మార్పులు ప్రకటించింది. ఈ కొత్త ప్లేయింగ్ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌ల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పుల్లో ప్రధానంగా బ్యాటర్ల టైమ్‌పాస్‌కు అడ్డుకట్ట వేయడం, టెస్టుల్లో వెలుతురు లేమి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, రనౌట్ విధానంలో స్పష్టత తీసుకురావడం వంటివి ఉన్నాయి.
బ్యాటర్లు సమయం వృథా చేస్తే 5 పరుగుల పెనాల్టీ
పురుషుల క్రికెట్‌లో బ్యాటర్లు సమయాన్ని వృథా చేయకుండా ఐసీసీ కఠిన నిబంధన తెచ్చింది. నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటర్ సిద్ధంగా లేకపోతే అంపైర్లు మొదటిసారి హెచ్చరిస్తారు. రెండోసారి కూడా అదే పునరావృతమైతే ఫైనల్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి లేదా ఆపై ఎన్నిసార్లు ఆలస్యం చేసినా ప్రతిసారీ ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయిస్తారు. 2025 లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జ్యాక్ క్రాలీ, బెన్ డకెట్ సమయం వృథా చేశారంటూ శుభ్‌మన్ గిల్ నిరసన తెలిపిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
పగటి టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్స్
టెస్ట్ మ్యాచ్‌ల్లో వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు పగటి పూట జరిపే సాధారణ టెస్టుల్లోనూ పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ ప్రాతిపదికన అనుమతినిచ్చారు. రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్ ప్రారంభానికి ముందే దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. ఒప్పందం కుదిరిన తర్వాత మ్యాచ్ మధ్యలో మళ్లీ బంతి రంగును మార్చడానికి వీలుండదు. దీనివల్ల ఆట సమయం వృథా కాకుండా మ్యాచ్‌లు సాఫీగా జరుగుతాయని ఐసీసీ భావిస్తోంది.
చివరి ఓవర్‌లో వికెట్ పడినా ఆట ఆగదు
టెస్టు మ్యాచ్‌లో రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడితే వెంటనే ఆ రోజు ఆట ముగిసినట్లు ప్రకటించే పాత పద్ధతికి ఐసీసీ స్వస్తి పలికింది. మైదానంలో వాతావరణం, వెలుతురు అనుకూలంగా ఉంటే ఆ ఓవర్ పూర్తి చేసేంతవరకు ఆట కొనసాగుతుంది. మిగిలిన బంతులను తర్వాతి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఆ ఓవర్ పూర్తయ్యాకే ఆటను ముగిస్తారు. దీనివల్ల పూర్తి ఓవర్ల కోటా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
రనౌట్, వైడ్ బాల్ నిబంధనల్లో మార్పులు
రనౌట్, స్టంపింగ్ సమయాల్లో బంతిపై పూర్తి కంట్రోల్ ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది. వికెట్లను పడగొట్టే క్షణంలో గ్లోవ్స్ లేదా చేతిలో బంతి పూర్తిగా స్థిరంగా ఉండాలి. కేవలం బంతిని తగిలిస్తూ వికెట్లు పడగొడితే అది అవుట్ కింద పరిగణించరు. పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20) మ్యాచ్‌ల్లో వైడ్ బాల్ నిబంధనను శాశ్వతం చేశారు. బౌలర్ రన్ అప్ ప్రారంభించాక బ్యాటర్ తన స్థానం నుంచి పక్కకు జరిగితే, బౌలర్ వేసే బంతి వైడ్ అవుతుందో లేదో నిర్ణయించడానికి బ్యాటర్ నిలబడిన స్థానాన్నే బెంచ్ మార్క్‌గా తీసుకుంటారు.
మహిళల క్రికెట్ బంతుల సైజు లెక్కింపు
మహిళల అంతర్జాతీయ క్రికెట్ కోసం ఉపయోగించే బంతుల సైజు, బరువు కొలతల్లో కచ్చితమైన కఠిన ప్రమాణాలను నిర్దేశించారు. పురుషుల బంతి బరువు 156-163 గ్రాములు ఉండగా, మహిళల బంతి బరువు 142-149 గ్రాములు ఉండాలి. అలానే టీ20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ బ్రేక్ సమయం 15 నిమిషాలుగా నిర్ణయించారు. సమయం వృథా అయిన సందర్భాల్లో దీనిని కనీసం 10 నిమిషాలకు తగ్గించవచ్చు. డ్రింక్స్ ఇంటర్వెల్ సమయంలో ప్రధాన కోచ్ లేదా ప్రతినిధి మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
