AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: 2027 వరల్డ్ కప్‌పై రోహిత్ శర్మ క్లారిటీ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త జోష్!

Rohit Sharma: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వరల్డ్ కప్ గెలవడంలో ఉండే ఆనందం ప్రత్యేమని, ఆ అనుభూతిని మళ్లీ పొందడానికే తను కష్టపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.

Rohit Sharma: 2027 వరల్డ్ కప్‌పై రోహిత్ శర్మ క్లారిటీ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త జోష్!
Rohit Sharma
Rakesh
|

Updated on: Oct 01, 2026 | 5:10 PM

Share

Rohit Sharma: భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ 2027లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్‌ను నిలిపిన హిట్‌మ్యాన్.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో 2027లో జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్‌ను గెలవడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

గౌహతి వన్డేలో విధ్వంసకర సెంచరీ

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. బుధవారం గౌహతిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 75 బంతుల్లోనే 101 పరుగులు చేసి అదరగొట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (133 బంతుల్లో 223 నాటౌట్) డబుల్ సెంచరీతో కలసి భారత్ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ వన్డేల్లో 12,000 పరుగుల అరుదైన మైలురాయిని కూడా దాటేశారు.

ప్రపంచకప్ గెలిస్తే వచ్చే ఆనందమే వేరు

జియోస్టార్ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ ప్రపంచకప్ విజయం అందించే అనుభూతి వర్ణనాతీతమని పేర్కొన్నారు. 2007లో 20 ఏళ్ల కుర్రాడిగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోజులను, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ విజయం ఎంత కీలకమో అర్థమైందని తెలిపారు. ఆ అనుభూతిని వన్డే ప్రపంచకప్ రూపంలో మళ్లీ సొంతం చేసుకోవడానికే తను ఆరాటపడుతున్నట్లు చెప్పారు.

ప్రజెంట్లో ఉండటమే నా స్ట్రాటజీ

ఇప్పటినుంచే 2027 అక్టోబర్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రోహిత్ అభిప్రాయపడ్డారు. ప్రతి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించడం, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, రోజూ కష్టపడటమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. రాబోయే ప్రతి సిరీస్‌లో జట్టుకు అవసరమైన సహకారాన్ని అందించడమే లక్ష్యమని, అడుగుల వారీగా ముందుకు సాగడం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు.

సౌతాఫ్రికా వేదికగా 2027 ప్రపంచకప్ సమరం

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ లోగా తన ఆటతీరును, ఫిట్‌నెస్‌ను అత్యున్నత స్థాయిలో ఉంచుకుని 2027 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో రోహిత్ శర్మ ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us