USA-Iran War: ‘రూబియోకు చరిత్ర తెలియదేమో..’ తాజ్ సందర్శనపై అమెరికాకు ఇరాన్ దిమ్మతిరిగే చురకలు
ఇరాన్ వాస్తుశిల్పుల మేధస్సుతో నిర్మించిన ఆగ్రాలోని తాజ్ మహల్ ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దంపతులు ఫొటోలకు ఫోజులివ్వడంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ నాగరికతను పూర్తిగా తుడిచివేస్తామని ట్రంప్ ప్రగల్భాలు పలికాడు. కానీ ఇరాన్ వాస్తు నైపుణ్యంతో నిర్మించిన తాజ్ మహల్ ముందు అమెరికా విదేశాంగ మంత్రి ఫొటోలకు ఫొజులు ఇవ్వడం ఏమిటో? అని చురకలు వేసింది..

హైదరాబాద్, మే 26: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూబియో సోమవారం ఆగ్రాకు చేరుకుని అక్కడి ప్రసిద్ధ స్మారక చిహ్నమైన తాజ్‌మహాల్ సందర్శించారు. రూబిన్ తాజ్ మహల్ పర్యటనపై హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఘాటుగా స్పందించింది. తాజ్‌మహల్ స్మారక చిహ్నాన్ని ఇరాన్ వాస్తుశిల్పుల మేధస్సుతో నిర్మించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మే 25 (సోమవారం) ట్వీట్ చేసింది. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని అమెరికా చేసిన బెదిరింపులను సందర్భంగా ఎద్దేవా చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి రూబియో సోమవారం తన భార్య జీనెట్ రూబియోతో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించారు. మొఘల్ కాలానికి చెందిన ఈ కట్టడాన్ని ‘ప్రపంచ ప్రేమ నిధులలో ఒకటి (one of the love treasures of the world)’గా అభివర్ణించారు. ఈ సందర్భంగా భార్యతో కలిసి తాజ్‌మహల్ వద్ద దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై హైదరాబాద్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా చురకలు వేస్తూ ట్వీట్ చేసింది. ‘రూబియోకు చరిత్ర, వాస్తుశిల్పం గురించి తెలిసి ఉంటే అతను తాజ్‌మహల్ వద్ద ఫోటోకు పోజులు ఇచ్చి ఉండేవాడు కాదు. ఈ స్మారక చిహ్నం నిర్మించిన చక్రవర్తి (షాజహాన్) ఇరానీ భార్య (ముంతాజ్)పై ఉన్న ప్రేమతో, ఇరానీ వాస్తుశిల్పుల మేధస్సుతో నిర్మించింది. కానీ రూబిన్ ప్రభుత్వం మాత్రం నేడు ఇతర నాగరికతలను అవమానిస్తూ, ఇరానీ నాగరికతను తుడిచిపెట్టేస్తామని బెదిరిస్తోందని’ తన ట్వీట్‌లో ఎద్దేవా చేసింది.
If Rubio knew the history or architecture, he wouldn’t have posed for a picture here. This monument was built out for the love of emperor’s Iranian wife, crafted by the genius of Iranian architects — meanwhile his government today threatens to wipe out Iranian civilization,… pic.twitter.com/zi4CNU3u7U
— Iran In Hyderabad (@IraninHyderabad) May 25, 2026
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో ఏప్రిల్ 7న ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒప్పందం కుదరకపోతే ఈ రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దానిని మళ్లీ ఎప్పటికీ తిరిగి నిర్మించలేరు’ అన్న ట్రంప్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇరాన్ కాన్సులేట్ గుర్తు చేసింది. ఇరాన్ కాన్సులేట్ తన ట్వీట్‌కు తాజ్ మహల్ ముందు రూబియో తన భార్యతో కలిసి దిగిన ఫోటోను ట్యాగ్ చేస్తూ తమ నాగరికత గొప్పతనం గురించి వివరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




