ICC Rankings : కోహ్లీ, అభిషేక్ తర్వాత ఈషాన్.. ఐసీసీ రేటింగ్స్‌లో టాప్ భారత బ్యాటర్ల జాబితా ఇదే
ICC Rankings : టీ20ల్లో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈషాన్ కిషన్ 916 ఐసీసీ రేటింగ్ పాయింట్లతో కొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ సరసన చేరిన ఈషాన్, భారత్ తరఫున అత్యధిక ఐసీసీ రేటింగ్ సాధించిన టాప్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ICC Rankings : భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఇటీవల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన 916 రేటింగ్ పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ఆ సిరీస్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే అతని రేటింగ్ ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం. ఈ ఘనతతో ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్-5 భారత బ్యాటర్ల జాబితాలో ఈషాన్ కిషన్ తన పేరును లిఖించుకున్నాడు.
అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన తన కెరీర్ అత్యుత్తమంగా టెస్టుల్లో 937 రేటింగ్ పాయింట్లను సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక భారతీయ ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. వన్డేలలో 911 పాయింట్లు, టీ20లలో 909 పాయింట్ల వరకు ఆయన చేరుకున్నాడు. ప్రస్తుతం టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ 2027 ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
గవాస్కర్‌ను దాటేసిన అభిషేక్ శర్మ
ఈ జాబితాలో భారత యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ను దాటేసి రెండవ స్థానంలో నిలిచాడు. గవాస్కర్ తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమంగా 916 రేటింగ్ పాయింట్లు సాధించగా, అభిషేక్ శర్మ టీ20లలో ఏకంగా 931 రేటింగ్ పాయింట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కొంతకాలం పాటు టీ20 నంబర్-1 బ్యాటర్‌గా రాజ్యమేలిన అభిషేక్ శర్మ, జింబాబ్వే పర్యటనలో కాస్త తడబడటంతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
జాబితాలో చోటు దక్కించుకున్న ఈషాన్, సూర్యకుమార్
ఈషాన్ కిషన్ ఇటీవల 916 రేటింగ్ పాయింట్లు సాధించి దిగ్గజాల సరసన మూడో స్థానంలో (గవాస్కర్‌తో సంయుక్తంగా) నిలిచాడు. ప్రస్తుతం టీ20లలో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా ఉన్న ఈషాన్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టాడు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్ అత్యుత్తమంగా టీ20 ఫార్మాట్‌లో 912 రేటింగ్ పాయింట్లు సాధించి ఈ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
టాప్-5 భారత బ్యాటర్ల రేటింగ్స్ వివరాలు
ఈ ఐసీసీ రేటింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ (టెస్టుల్లో 937 రేటింగ్) నిలవగా, రెండవ స్థానంలో అభిషేక్ శర్మ (టీ20ల్లో 931 రేటింగ్) ఉన్నాడు. మూడవ స్థానంలో సునీల్ గావస్కర్ (టెస్టుల్లో 916 రేటింగ్), ఈషాన్ కిషన్ (టీ20ల్లో 916 రేటింగ్) సంయుక్తంగా కొనసాగుతున్నారు. ఇక ఐదవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (టీ20ల్లో 912 రేటింగ్) నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
