భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సీక్రెట్ టిప్
Jiddu Krishnamurti Philosophy: మానవ జీవితంలో కోపం, భయం, ఆందోళన, బాధ, అసూయ వంటి భావోద్వేగాలు నిరంతరం ఉత్పన్నమవుతూనే ఉంటాయి. చాలామంది వీటిని బలవంతంగా నియంత్రించడానికి లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurti) బోధనల ప్రకారం భావోద్వేగాలను కంట్రోల్ చేయడం కంటే, వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం.

మన మనస్సులో దాగి ఉన్న పాత జ్ఞాపకాలు, చిన్ననాటి గాయాలు, గత అనుభవాలు నిరంతరం భావోద్వేగాల రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి. ఎమోషన్స్‌ను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు మనస్సులో అంతర్గత పోరాటం, ఒత్తిడి పెరుగుతుంది. భయం, ఆందోళన, దుఃఖం, అసూయ, ద్వేషం వంటి భావోద్వేగాలు సబ్-కాన్షియస్ మైండ్‌లో నిగూఢంగా ఉండి, తిరిగి తిరిగి వస్తూ, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బాల్యంలో జరిగిన గాయాలు లేదా అసంపూర్తిగా అర్థం చేసుకున్న సంఘటనల నుండి ఇవి ఉద్భవించే అవకాశముంది.
మానసిక ప్రశాంతతను వెతుకుతున్న వారికి, లోతుగా పాతుకుపోయిన భావోద్వేగాలతో ఎలా వ్యవహరించాలో జిడ్డు కృష్ణమూర్తి బోధనలు వివరిస్తాయి. భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వాట్ ఈజ్ (What is?) అనే సూత్రాన్ని కృష్ణమూర్తి సూచిస్తున్నారు. వాట్ ఈజ్ అంటే ప్రస్తుత క్షణంలో ఉన్నది ఉన్నట్లు చూడటం. అంటే మనసులోని భయం, కోపాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించడకుండా.. దానిపై ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లు నిశితంగా చూడాలని సూచిస్తారు.
వాట్ ఈజ్ (What is?)
జిడ్డు కృష్ణమూర్తి బోధనలలో ప్రధాన సూత్రం వాట్ ఈజ్ (ఉన్నది ఉన్నట్టు చూడటం) అనే భావన. భయం, కోపం, దుఃఖం, అసూయ లేదా అత్యాశ.. ఈ భావోద్వేగాలు కాలంతో పాటు మారుతుంటాయి. కానీ వాటి మూలమైనది మనసులో స్థిరంగా ఉంటుంది. దుఃఖం వచ్చినప్పుడు దానిని భరించలేక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించడం లేదా భయం వచ్చినప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చూడటం చేస్తుంటాం. ఇవి భావోద్వేగాన్ని అంగీకరించకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రమే. కృష్ణమూర్తి సందేశం ప్రకారం..మనం ఒక వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవడానికి వారితో సమయం గడుపుతామో.. అలాగే మనలో ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వాటితో గడపాలి. కొందరికి కారణం లేకుండా భయం, మరొకరికి చిన్న విషయాలకే కోపం, ఇంకొకరికి సులభంగా దుఃఖం వస్తుంటాయి. అలాంటి భావోద్వేగాలు గతంలో వచ్చినప్పుడు మనం వాటిని లోతుగా పరిశీలించకపోవడమే దీనికి కారణం..
భావోద్వేగాలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లుగా.. మనలో భావోద్వేగం వచ్చినప్పుడు దానిని కొత్త విషయంగా చూడాలి. దానిపై ఎలాంటి తీర్పు ఇవ్వకూడదు. నేను అనే కేంద్రం లేకుండా.. ఎటువంటి ప్రమేయం లేకుండా దానిని గమనించాలి. ఒక గోడపై పాకుతున్న బల్లిని ఎలాగైతే ఎటువంటి జోక్యం లేకుండా గమనిస్తామో, అలాగే భావోద్వేగ ఆలోచనల కదలికలను కేవలం గమనించాలి. ఆలోచన లేకుండా ఏ భావోద్వేగం ఉండదు. కాబట్టి, ఆ భావోద్వేగానికి సంబంధించిన ఆలోచనలు ఎలా వస్తున్నాయో కొత్తగా, విచిత్రంగా చూడాలి.. రష్యన్ భాష తెలియని వ్యక్తి ఆ భాషను ఎలా వింటాడో అలా..
ఈ నిశ్శబ్ద పరిశీలన ద్వారా, భావోద్వేగం తనంతట తానుగా చల్లబడిపోతుంది. ఎటువంటి అంగీకారం, తిరస్కరణ, పేరు పెట్టడం లేదా తీర్పు లేకుండా చూడటం వల్ల దానిలోని సత్యం బయటపడుతుంది. ఈ పూర్తి అటెన్షన్ (శ్రద్ధ) ద్వారా, ఆ భావోద్వేగం బలహీనపడి, దాని ప్రభావం మనపై ఉండదు. దుఃఖం, బాధ లేదా ఆందోళనను కలిగించే శక్తిని అది కోల్పోతుంది, తద్వారా సమత్వ స్థితిని అనుభవించగలం.
ఆరోగ్యానికి మేలు
ఈ భావోద్వేగాలను సరైన రీతిలో ఎదుర్కోవడం మన ఆరోగ్యానికి కూడా మంచిది. భయం, ఆందోళ, దు:ఖం వంటి భావోద్వేగాలు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గుండె వేగం పెరగడం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వంటివి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. మన మనసులో నిక్షిప్తమైన ఈ భావోద్వేగాలు మనం వాటిని పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు నిరంతరం తిరిగి వస్తూ ఉంటాయి.
Also Read: ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ అదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం




