AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Sapta Jyotirlinga Yatra: 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. టూర్ ప్యాకేజీ ధరలు ఇవే!

IRCTC Sapta Jyotirlinga Yatra 2026 Telugu: జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలనుకునే భక్తులకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 11 రోజుల ఈ యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ప్రముఖ ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌కు రూ.18 వేల నుంచి ప్యాకేజీ ధరలు ప్రారంభమవుతున్నాయి.

IRCTC Sapta Jyotirlinga Yatra: 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. టూర్ ప్యాకేజీ ధరలు ఇవే!
Irctc Sapta Jyotirlinga Yatra 2026
Rajashekher G
|

Updated on: Oct 05, 2026 | 2:31 PM

Share

IRCTC Sapta Jyotirlinga Yatra 2026 Telugu: భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ యాత్రను నిర్వహించనుంది. 10 నవంబర్ 2026న ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో 10 రాత్రులు, 11 రోజుల వ్యవధిలో దేశంలోని ఏడు ముఖ్యమైన జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది.

ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సోమనాథ్, పుణె, నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు, ద్వారకలో నాగేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారకను దర్శించవచ్చు. అనంతరం సోమనాథ్ జ్యోతిర్లింగం, పుణెలో భీమాశంకర్ జ్యోతిర్లింగం, ఓజర్‌లోని విఘ్నహర అష్టవినాయక ఆలయం, నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్‌లో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించారు.

ప్రయాణం నవంబర్ 10న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్‌ఖేడ్, నాందేడ్, పూర్ణా జంక్షన్‌లలో ప్రయాణికులు రైలును ఎక్కవచ్చు. నవంబర్ 11న ఉజ్జయిని చేరుకుని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మరుసటి రోజు ఓంకారేశ్వర్ దర్శనం అనంతరం ద్వారకకు బయలుదేరుతారు. ద్వారకలో ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర్ దర్శనం పూర్తిచేసుకుని సోమనాథ్‌కు వెళ్తారు.

ఇవి కూడా చదవండి

తర్వాత పుణె చేరుకుని భీమాశంకర్ జ్యోతిర్లింగంతో పాటు ఓజర్‌లోని విఘ్నహర గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్‌లో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని నవంబర్ 20న సికింద్రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.

ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ఎకానమీకి పెద్దలకు రూ.18,000, పిల్లలకు రూ.16,700, 3AC స్టాండర్డ్‌కు పెద్దలకు రూ.27,400, పిల్లలకు రూ.25,900గా ధర నిర్ణయించారు. 2AC కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు రూ.35,500, పిల్లలకు రూ.33,600గా ఉంది. ఈ ధరల్లో GSTతో పాటు రైలు ప్రయాణం, హోటల్ బస, రవాణా, శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్స్, IRCTC టూర్ మేనేజర్ల సేవలు వంటి సదుపాయాలు ఉంటాయి.

అయితే స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, బోటింగ్, వ్యక్తిగత ఖర్చులు, గైడ్ ఛార్జీలు, టిప్పులు, రూమ్ సర్వీస్ వంటి అదనపు ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. భీమాశంకర్ ఆలయంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున 2026 జూన్ 15 నుంచి దర్శన సమయం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటుందని IRCTC పేర్కొంది.

ఈ ఆధ్యాత్మిక యాత్రకు టూర్ కోడ్ SCZBG68. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉండగా, స్లీపర్‌లో 237, 3ACలో 416, 2ACలో 52 సీట్లు కేటాయించారు. ప్రయాణ సమయాలు, రైలు రాకపోకల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండే అవకాశం ఉందని IRCTC తెలిపింది.

IRCTC సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర టికెట్ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us