AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osho Story: ఓషో విలక్షణ తత్వం.. ఆ సలహా ఇప్పటికీ చర్చనీయాంశమే..!

ఓషో రజనీష్‌ది విలక్షణమైన, సంచలనాత్మకమైన ఆలోచనా విధానం. సమాజం ఎంతో పవిత్రంగా భావించే విలువలను, సంప్రదాయాలను, వ్యక్తులను ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో ప్రశ్నించేవారు. ఆయన బోధనలు వినడానికి కాస్త కఠినంగా అనిపించినా, వాటి వెనుక మనుషులను భ్రమల నుంచి మేల్కొలిపే ఒక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంటుంది

Osho Story: ఓషో విలక్షణ తత్వం.. ఆ సలహా ఇప్పటికీ చర్చనీయాంశమే..!
Osho StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 18, 2026 | 2:09 PM

Share

ప్రపంచ ఆధ్యాత్మిక జగత్తులో ఓషో రజనీష్‌ది ఒక ప్రత్యేక ప్రస్థానం. 20వ శతాబ్దానికి చెందిన ఓషో అత్యంత ప్రభావవంతమైన భారతీయ ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త. గత 100 ఏళ్లలో ప్రపంచం తమ వైపు తిరిగి చూసేలా చేసిన వ్యక్తుల్లో ఓషో కూడా ఒకరు. 1931లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఓషో.. మొదట తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి, భారతదేశమంతటా పర్యటిస్తూ సాంప్రదాయ మతాలను, సమాజంలోని మూఢనమ్మకాలను, రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. ఆయన విలక్షణ తత్వం, ప్రసంగాలు ఎందరో కళ్లు తెరిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వివాదాలను రేపాయి కూడా. ఓషో జీవితంలోని కొన్ని ప్రముఖ సంఘటనలు, ఆలోచనలు పరిశీలిస్తే ఆయన తీరు ఎంత భిన్నంగా ఉండేదో అర్థమవుతుంది.

ఆత్మహత్యా ప్రయత్నం చేసిన యువకుడి కథ

(ఓషో తత్వంలో ప్రచారంలో ఉన్న కథ)

ఒకసారి ఒక తండ్రి తన కొడుకును తీసుకుని ఓషో ఆశ్రమానికి వచ్చాడు. “స్వామీ! వీడు ఇప్పటికి చాలాసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు. ఎలాగోలా వీడికి బతికేలా బుద్ధి చెప్పండి” అని వేడుకున్నాడు. సాధారణంగా ఏ గురువైనా అయితే ఆ యువకుడికి ఊరటనిచ్చే మాటలు మాట్లాడి, జీవితం విలువను వివరించడానికి ప్రయత్నించేవారు. కానీ ఓషో ఆ యువకుడి వైపు నిశితంగా చూసి ఇలా అన్నారు: “చాలాసార్లు నువ్వు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశావంటే నీకు‌ చావడం కూడా చేతకాలేదన్న మాట! చావడం కూడా చేతకాని నువ్వు ఇక బతకడం అనవసరం. వెళ్లి చావోచ్చు కదా!”

ఇవి కూడా చదవండి

ఈ మాటలు వినడానికి ఎంతో క్రూరంగా, షాకింగ్‌గా అనిపిస్తాయి. కానీ దీని వెనుక ఓషో ఉద్దేశం వేరు. పదేపదే ఆత్మహత్యా ప్రయత్నాలు చేసేవాళ్లు నిజానికి చావాలని అనుకోరు. సమాజం లేదా కుటుంబం నుండి సానుభూతిని, దృష్టిని ఆకర్షించడానికి అలా చేస్తుంటారు. ఓషో ఆ యువకుడిలోని ఆ నటనను, బలహీనతను దెబ్బతీయడానికి అంత కఠినమైన మాటలు వాడారు. చావడం కూడా చేతకాని వాళ్లు, పదేపదే తప్పులు చేస్తూ వాటిని దిద్దుకోని వాళ్లు జీవితాన్ని వృథా చేయడమే కాకుండా, తమ చుట్టూ ఉన్న సమాజానికి కూడా హానికరంగా మారతారని ఓషో నమ్మేవారు. ఈ కఠినమైన చికిత్స (Shock Therapy) ఆ యువకుడిలో భయాన్ని, ఆలోచనను రేకెత్తించి అతనిలో శాశ్వితమైన మార్పు తెచ్చిందట. ఇతరుల సానుభూతి కోసం పరితపించే మనస్తత్వాన్ని మానుకోవాలన్న సందేశం కూడా ఇందులో ఉంది.

ఆ కఠినమైన సలహా ఇప్పటికీ చర్చనీయాంశమే..

అయితే ఓషో ఈ రకమైన సలహా ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టే వారు ఇప్పటికీ ఉన్నారు. ఆయన సలహా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఓషో విలక్షణ తత్వాన్ని లోతుగా ఆకలింపు చేసుకున్న వారు మాత్రం కొందరికి అలాంటి షాక్ థెరపీ అవసరమేనని అభిప్రాయపడుతారు.

ఓషో తత్వం ఎంతో తార్కికంగా, మనస్తత్వ శాస్త్రానికి దగ్గరగా ఉంటాయి. సమాజం మిమ్మల్ని ఏం నమ్మమంటుందో అది గుడ్డిగా నమ్మడం కాదు..మీ అంతట మీరు సత్యాన్ని అన్వేషించడమే నిజమైన మతం అని ఓషో ప్రబోధించారు. 1990 జనవరి 19న ఆయన పూణే ఆశ్రమంలో కన్నుమూశారు. ఓషో స్వయంగా ఎలాంటి పుస్తకాలు రాయలేదు. కానీ ఆయన వేలాది గంటల పాటు ఇచ్చిన ప్రసంగాలను ఆయన అనుచరులు పుస్తకాలుగా మార్చారు. దాదాపు 650కి పైగా పుస్తకాలు ఓషో పేరు మీద ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

Follow Us