ఇతరులతో పోల్చుకుంటే సంతోషం దక్కదు.. గాడిద–పిచ్చుకల కథ చెప్పే జీవిత సత్యం..!
Telugu Moral Story: నీతి కథలు పిల్లలతో పాటు పెద్దలకు కూడా విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తాయి. మనకు లేనిదాని గురించి బాధపడటం కంటే, ఉన్నదానితో సంతృప్తిగా జీవించడమే నిజమైన ఆనందమనే సందేశాన్ని గాడిద–పిచ్చుకల ఈ హృద్యమైన నీతి కథ చక్కగా తెలియజేస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల కలిగే అసంతృప్తిని దూరం చేసి, కృతజ్ఞతతో జీవించడం ఎంత ముఖ్యమో ఈ కథ వివరిస్తుంది.

నీతి కథలు పిల్లలకు నైతిక విలవులను నేర్పేందుకు ఎంతగానే దోహదపడుతాయి. నిత్య జీవితంలో చాలా మందికి ఎన్ని ఉన్నా ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. ఉన్నదాని గురించి పట్టించుకోకుండా లేనిదాని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నిస్సారంగా గడుపుతుంటారు. మన జీవితంలో మనకు లేనిదాని గురించి ఆలోచించి బాధపడటం కంటే, మనకున్న దానితో సంతృప్తిగా బతకడమే నిజమైన ఆనందం అని చెప్పే ఒక చక్కని నీతి కథ ఇది.
కథ
పూర్వం ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ వ్యాపారి బరువులు మోయడానికి దానిని ఉపయోగించేవాడు. తన ఇంటి ముందు ఉన్న ఒక పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఒక పిచ్చుకల జంట నివసిస్తుండేది. ఒక రోజు ఆ పిచ్చుకల జంట చాలా విచారంగా ఉండటం గాడిద గమనించింది. “పిచ్చుకలారా! ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి?” అని గాడిద అడిగింది.
దానికి పిచ్చుకలు బాధగా.. “ఏం చెప్పమంటావు మిత్రమా! మేము ఎంతో కష్టపడి కట్టుకున్న గూడు నిన్న వచ్చిన గాలివానకు కూలిపోయింది” అని చెప్పాయి. అప్పుడు గాడిద జాలిపడి, “ఓస్… అంతేనా! నా పాకలో మీరు గూడు కట్టుకోండి. ఎన్ని గాలివానలు వచ్చినా ఇక్కడ ఏమీ కాదు” అని ఆశ్రయం ఇచ్చింది.
గాడిద సహాయంతో పిచ్చుకల జంట పాకలో గూడు కట్టుకుని, రోజూ ఉత్సాహంగా, తుర్రుతుర్రుమని ఎగురుతూ ఆనందంగా గడపసాగాయి. ఎంతో ఆనందంగా ఉన్న ఆ పిచ్చుకల జంటను చూసిన గాడిదకు మెల్లగా అసంతృప్తి మొదలైంది. “నాకూ రెక్కలు ఉంటే ఎంత బాగుండు! ఎంచక్కా స్వేచ్ఛగా విహరించవచ్చు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది” అని తన మనసులోని బాధను పిచ్చుకలతో పంచుకుంది గాడిద.
గాడిద మాటలు విన్న పిచ్చుకలు ఆశ్చర్యపోయి ఇలా అన్నాయి. “మిత్రమా…! మేము రోజూ నిన్ను చూసి నువ్వు ఎంత అదృష్టవంతుడివో అనుకుంటాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని నీకు లేదు. ఉండటానికి సొంతంగా గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నీ యజమాని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.”
“కానీ మా పరిస్థితి చూడు… ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు ప్రతి క్షణమూ భయమే! ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి, నువ్వు నీ జీవితం పట్ల అసంతృప్తి చెందుతున్నావంటే మాకు ఆశ్చర్యంగా ఉంది” అని వివరించాయి.
నీతి
పిచ్చుకల మాటలతో గాడిదకు జ్ఞానోదయం అయింది. ఇప్పటివరకు వాటి స్వేచ్ఛను మాత్రమే చూసి, వాటి వెనుక ఉన్న ప్రాణభయాన్ని తాను గమనించలేదని గ్రహించింది. వాస్తవాన్ని తెలుసుకున్న గాడిద ఆ రోజు నుంచి ఇతరులతో పోల్చుకోవడం మాని, తన జీవితంతో తను సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది.
ఇతరుల జీవితాలు పైకి ఎంతో అందంగా, సుఖంగా కనిపించవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి మాత్రమే తెలిసిన కష్టాలు, సవాళ్లు ఉంటాయి. కాబట్టి, మనకు ఉన్నదానితో సంతృప్తి చెందడమే సుఖవంతమైన జీవితానికి రహస్యం.
Also Read: నీతి కథ.. పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట..బలం కంటే తెలివి గొప్పది..!




