AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhruv Jurel: మైదానంలో జురెల్ చేసే సెల్యూట్ వెనుక ఇంత కథ ఉందా? తెలిస్తే షాక్ అవుతారు

Dhruv Jurel: టీమిండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ ప్రతి మైలురాయి తర్వాత సెల్యూట్ ఎందుకు చేస్తాడో ఆయన తండ్రి నేమ్ చంద్ వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడైన నేమ్ చంద్ తన అనుభవాలను పంచుకున్నారు. యుద్ధానికి ముందు భార్యకు రాసిన లేఖ, కొడుకు క్రికెట్ ప్రయాణం, సెల్యూట్ వెనుక ఉన్న భావోద్వేగ కథ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

Dhruv Jurel: మైదానంలో జురెల్ చేసే సెల్యూట్ వెనుక ఇంత కథ ఉందా? తెలిస్తే షాక్ అవుతారు
Dhruv Jurel Salute Celebration
Rakesh
|

Updated on: Nov 29, 2026 | 4:40 PM

Share

Dhruv Jurel: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన ఆటతోనే కాదు.. మైదానంలో చేసే సెల్యూట్ సెలబ్రేషన్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అర్ధ సెంచరీ చేసినా, మరో కీలక మైలురాయిని అందుకున్నా సైనికుడిలా సెల్యూట్ చేస్తుంటాడు. అయితే ఈ సెల్యూట్ వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. జురెల్ తండ్రి నేమ్ చంద్ భారత సైన్యంలో పనిచేశారు. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. తండ్రి దేశం కోసం చేసిన సేవకు గౌరవంగా జురెల్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడని ఆయన తండ్రి వెల్లడించారు.

కార్గిల్ యుద్ధానికి వెళ్లే ముందు భార్యకు లేఖ

కార్గిల్ యుద్ధంలో పాల్గొనే ముందు నేమ్ చంద్ తన భార్యకు ఒక లేఖ రాశారు. యుద్ధంలో తనకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఆ లేఖలో వివరించారు. తన పొదుపు డబ్బులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో కూడా భార్యకు చెప్పారు. యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికుడిగా ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పుడు కొడుకు సెల్యూట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి.

8వ జాట్ రెజిమెంట్‌లో పనిచేసిన నేమ్ చంద్

నేమ్ చంద్ భారత సైన్యంలోని 8వ జాట్ రెజిమెంట్‌లో పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత జులై 26ను విజయ్ దివస్‌గా ప్రకటించారని, మరుసటి రోజు సైనికులు కొండ ప్రాంతాల నుంచి కిందకు వచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మైదాన ప్రాంతాలకు చేరుకున్నప్పుడు అదొక కలలా అనిపించిందని చెప్పారు. 2008లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. దేశం కోసం తండ్రి చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ధ్రువ్ ప్రతి కీలక ఇన్నింగ్స్ తర్వాత సెల్యూట్ చేస్తున్నాడు.

కొడుకు క్రికెట్ కోసం తండ్రి చేసిన త్యాగం

ధ్రువ్ చిన్నప్పుడు చదువులో చాలా చురుగ్గా ఉండేవాడని నేమ్ చంద్ చెప్పారు. అయితే క్రికెట్‌పై ఆసక్తి పెరగడంతో అదే అతడి ప్రధాన లక్ష్యంగా మారిందని తెలిపారు. కొడుకు క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి అవసరమైన వస్తువుల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. బ్యాట్, షూస్, ఇతర క్రికెట్ పరికరాలు ఏవైనా సరే నాణ్యమైనవి కొనిచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. కొడుకు ఎదుగుదల వెనుక కుటుంబం చేసిన కృషి కూడా ఉందని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.

కొడుకు ఆట చూడటానికి తొలిసారి విదేశాలకు

ధ్రువ్ జురెల్ ఆడే మ్యాచ్‌ను చూడటానికి నేమ్ చంద్ తన భార్యతో కలిసి తొలిసారి విదేశాలకు వెళ్లారు. న్యూజిలాండ్‌లో తన కొడుకు ఆటను ప్రత్యక్షంగా చూడటం ప్రత్యేక అనుభూతి అని చెప్పారు. సిరీస్ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో ధ్రువ్ నిర్ణయిస్తాడని, అతను చెప్పినట్లే తాము చేస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. ధ్రువ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో మాత్రం స్టేడియానికి వెళ్లలేదు. ఆ సమయంలో బాంకే బిహారీ దర్శనానికి వెళ్లడంతో మ్యాచ్‌కు రాలేకపోయానని వివరించారు. ఇలా ధ్రువ్ ప్రతి సెల్యూట్ వెనుక తండ్రి సైనిక జీవితం, కుటుంబం చేసిన త్యాగం, దేశంపై గౌరవం దాగి ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us