నాని అంటేనే సహజసిద్ధమైన నటన, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు. స్టార్ డమ్ కోసం మాస్ రూట్ ఎంచుకున్న ఈ హీరో, ఇప్పుడు మళ్ళీ తన పాత ఇమేజ్ను గుర్తొచ్చుకున్నట్లు తెలుస్తోంది. దసరా చిత్రంతో మాస్ హీరోగా విజయం సాధించిన నాని, ఆ తర్వాత హిట్ 3, ది ప్యారడైజ్ లాంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో తన రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయోగాలు ఆశించినంతగా విజయం సాధించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు నాని తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. వరుస యాక్షన్ చిత్రాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, తనకు బాగా కలిసొచ్చిన కుటుంబ, ఎమోషనల్ డ్రామాలపైనే దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగానే 96, సత్యం సుందరం వంటి హృదయాన్ని హత్తుకునే చిత్రాలను అందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్తో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అంతేకాదు, నిన్ను కోరి సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన శివ నిర్వాణతో కూడా మరోసారి జతకట్టేందుకు నాని సిద్ధమవుతున్నారు. అంటే, నాని తదుపరి ఇన్నింగ్స్లో మాస్ యాక్షన్ కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారన్నమాట. మరి, ఈ ఫ్యామిలీ హీరో యూటర్న్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.