ఓటు వేయడానికి 18 ఏళ్లు.. పోటీ చేయడానికి 25 ఏళ్లు ఎందుకు?

×

ఓటు వేయడానికి 18 ఏళ్లు.. పోటీ చేయడానికి 25 ఏళ్లు ఎందుకు?

భారతదేశంలో ఓటు వేయడానికి 18 ఏళ్లు నిండితే సరిపోతుంది, అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం 25 ఏళ్లు ఉండాలి. రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయాలంటే కనీసం 30 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఈ వయోపరిమితులపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఓటు వేసే వయసు కూడా 21 సంవత్సరాలుగా ఉండేది, అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 18 ఏళ్లకు తగ్గించారు. ఇదే విధంగా, ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును కూడా తగ్గించాలని నల్ల సురేష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్‌ను నవంబర్ 28న జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. అయితే, ఈ పిటిషన్ సరైన విధానంలో లేదని పేర్కొంటూ, ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పిటిషనర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించాలనే అంశం మాత్రం చర్చనీయాంశంగానే మిగిలింది.

Phani CH