Moral Story: పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట..బలం కంటే తెలివి గొప్పది..!
Hen and Snake Moral Story: బలం కంటే తెలివి గొప్పదనే సందేశాన్ని అందించే అద్భుతమైన నీతి కథ ఇది. తన కోడిపిల్లలను రక్షించుకోవడానికి ఓ కోడిపెట్ట తెలివిగా విషపూరితమైన పాముకి ఎలా గుణపాఠం చెప్పిందో ఈ కథ హృదయానికి హత్తుకునేలా వివరిస్తుంది. పిల్లల్లో ధైర్యం, తెలివి, ఐకమత్యం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే ఓ ఆసక్తికరమైన కథ ఇది.

నీతి కథలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, ఒక మనిషి జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని సరైన దారిలో పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కథలతో పిల్లల్లో మంచి ప్రవర్తన, విలువలు అలవడుతాయి. అలాగే వారిలో ఆలోచనా శక్తి, సమస్యల పరిష్కార శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. బలం కంటే తెలివి గొప్పదని పిల్లలకు అర్థమయ్యేలా చేబుతుంది ‘పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట’ కథ. తన కోడిపిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో పాముకి కోడిపెట్ట ఎలా గుణపాఠం చెప్పిందో ఈ కథలో గుండెలకు హత్తుకునేలా వివరించడం జరిగింది.
కథ
అనగనగా ఒక చిన్న అడవిలో ఓ కోడిపెట్ట తన పది కోడిపిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా జీవించేది. ప్రతిరోజూ వాటికి ఆహారం ఎలా వెతుక్కోవాలో, ప్రమాదాలను ఎలా గుర్తించాలో నేర్పిస్తూ ప్రేమగా పెంచేది. ఒకరోజు కోడిపెట్ట తన పిల్లలకు గింజలు ఏరుకోవడం నేర్పిస్తుండగా, పొదల చాటు నుంచి ఒక్కసారిగా ఓ పాము బుస్సుమంటూ బయటకు వచ్చింది. కోడిపెట్ట వెంటనే అప్రమత్తమై పిల్లలకు హెచ్చరించింది. చాలా కోడిపిల్లలు తప్పించుకున్నా, ఒక చిన్న కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. ఆ పాము దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది.
ఆ రోజు నుంచి పాము తరచూ మాటువేసి ఒక్కో కోడిపిల్లను తినడం ప్రారంభించింది. కోడిపెట్ట ఎంత జాగ్రత్త పడినా దాని దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. చివరకు దానికి రెండు కోడిపిల్లలు మాత్రమే మిగిలాయి. దుఃఖంతో నిండిన కోడిపెట్ట చివరి ప్రయత్నంగా పాము పుట్ట దగ్గరకు వెళ్లి “దయచేసి నా మిగిలిన రెండు పిల్లలను వదిలేయి” అని వేడుకుంది. అయితే పాము నిర్దాక్షిణ్యంగా “నేను నా ఆహారాన్ని తింటున్నాను. రేపు వచ్చి మిగిలిన వాటినీ తింటాను” అని చెప్పి పంపించింది.
తెలివితో వేసిన అద్భుతమైన ప్లాన్
పాము మాటలు విన్న కోడిపెట్ట నిరాశ చెందలేదు. బలంతో గెలవలేనప్పుడు తెలివితో గెలవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితులైన తేనెటీగల వద్దకు వెళ్లి సహాయం కోరింది. కోడిపెట్ట బాధను అర్థం చేసుకున్న తేనెటీగలు తమ తుట్టెలోని తేనెను తీసుకువచ్చి పాము పుట్టలో పోశాయి. తేనె జిగురులో పాము చిక్కుకుపోయి బయటకు రాలేక ఇబ్బంది పడింది.
తీపి తేనె వాసనకు ఆకర్షితులైన చీమలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అసలు ఆ పుట్టను ముందుగా చీమలే నిర్మించాయి. కానీ పాము వాటిని వెళ్లగొట్టి ఆ పుట్టను ఆక్రమించుకుంది. అందుకే చీమలకు కూడా పాముపై కోపం ఉంది.
అవకాశం దొరకగానే చీమలన్నీ తేనెలో చిక్కుకున్న పాముపై ఒక్కసారిగా దాడి చేశాయి. వందలాది చీమల కాట్లను తట్టుకోలేక పాము నొప్పితో విలవిల్లాడింది. చివరకు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి చాలా దూరం పారిపోయింది.
పాము శాశ్వతంగా వెళ్లిపోవడంతో కోడిపెట్ట తన మిగిలిన రెండు పిల్లలను సురక్షితంగా పెంచుకుంది. ఇకపై ఆ అడవిలో ప్రశాంతంగా జీవించింది.
నీతి
బలం కంటే తెలివి గొప్పదని ఈ నీతి కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఐకమత్యంతో పని చేస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.
నీతి కథలతో పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనేది సులువుగా అర్థమవుతుంది. అబద్ధాలు చెబితే నష్టం జరుగుతుందని, నిజం చెబితే ఎప్పటికైనా గెలుపు లభిస్తుందని అర్థం చేసుకుంటారు. కృతజ్ఞత, దయ, కరుణ, త్యాగం వంటి గుణాలు అలవడుతాయి.
Also Read: పాము–ఎలుక స్నేహం.. బద్ధ శత్రువులు ఫ్రెండ్స్ ఎలా అయ్యాయి..?




