80 ఏళ్ల తర్వాత మళ్లీ మొదలైన నదీ ప్రయాణం.. అస్సాం నుంచి బంగ్లాదేశ్‌కు తొలి కార్గో!
దిబ్రూగఢ్: స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బంగ్లాదేశ్‌కు తొలి అంతర్జాతీయ సరుకు రవాణా నౌక బయలుదేరింది. బ్రహ్మపుత్ర నది ద్వారా అంతర్జాతీయ జలరవాణాకు కొత్త మార్గం తెరుచుకుంది. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ టెర్మినల్ నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తొలి కార్గో ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

దిబ్రూగఢ్: స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బంగ్లాదేశ్‌కు తొలి అంతర్జాతీయ సరుకు రవాణా నౌక బయలుదేరింది. బ్రహ్మపుత్ర నది ద్వారా అంతర్జాతీయ జలరవాణాకు కొత్త మార్గం తెరుచుకుంది. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ టెర్మినల్ నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తొలి కార్గో ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ తొలి అంతర్జాతీయ సరుకు రవాణాలో అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (APCL) ఉత్పత్తి చేసిన మొత్తం 1,080 టన్నుల మిథనాల్ ఉంది. రెండు నౌకలు కలిపి 54 ISO ట్యాంక్ కంటైనర్లను తీసుకెళ్తున్నాయి. ఒక్కో కంటైనర్‌లో సుమారు 20 టన్నుల మిథనాల్ ఉండగా.. ఒక్కో నౌక 540 టన్నుల సరుకును మోసుకెళ్తోంది.
బ్రహ్మపుత్ర నుంచి బంగ్లాదేశ్‌కు..!
ఈ సరుకు బోగిబీల్ నుంచి జాతీయ జలమార్గం-2గా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నది మీదుగా రవాణా అవుతుంది. అనంతరం భారత్-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం ద్వారా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి.. ఢాకాలోని పంగావ్ పోర్టుకు చేరుకుంటుంది. బోగిబీల్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు జలమార్గం సుమారు 783 కిలోమీటర్లు ఉండగా.. ఈ ప్రయాణానికి దాదాపు ఏడు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎగువ అస్సాంలో తయారయ్యే ఉత్పత్తులను రోడ్డు, రైలు మార్గాలపై మాత్రమే ఆధారపడకుండా నదీ మార్గం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతానికి ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మారే అవకాశం ఉంది.
మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ నదిలోకి..
ఈ సరుకు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు నౌకలకు కూడా ప్రత్యేకత ఉంది. ఇవి అస్సాం ప్రభుత్వ అంతర్గత జల రవాణా విభాగానికి చెందినవి. దాదాపు 30 ఏళ్లుగా వినియోగంలో లేకుండా ఉన్న ఈ నౌకలను APCL లీజుకు తీసుకుంది. గౌహతిలోని పాండులో పునరుద్ధరించి, వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా సిద్ధం చేసింది. ఇప్పుడు అవే నౌకలు బ్రహ్మపుత్ర మీదుగా తొలి అంతర్జాతీయ సరుకు రవాణాకు శ్రీకారం చుట్టాయి.
బోగిబీల్ టెర్మినల్‌కు కీలక మలుపు..!
కొత్తగా అభివృద్ధి చేసిన బోగిబీల్ అంతర్గత జల రవాణా టెర్మినల్‌కు కూడా ఈ ప్రయాణం కీలక పరీక్షగా మారింది. ఇక్కడ కార్గో జెట్టీ, గిడ్డంగులు, కస్టమ్స్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బోగిబీల్‌ను స్థానిక సరుకు రవాణా కేంద్రంగానే కాకుండా ఈశాన్య భారత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే కీలక జలమార్గంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం, IWAI లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రస్తుతం మిథనాల్‌తో ప్రారంభమైన ఈ రవాణా భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులకు విస్తరించే అవకాశం ఉంది. పాలిమర్లు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, టీ, వ్యవసాయ ఉత్పత్తులు, అస్సాంలోని GI-ట్యాగ్ ఉత్పత్తులను కూడా ఈ మార్గం ద్వారా తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
చరిత్రను తిరిగి తెస్తున్న బ్రహ్మపుత్ర..
బ్రిటిష్ పాలన సమయంలో బ్రహ్మపుత్ర నది అస్సాం వాణిజ్యానికి ప్రధాన జీవనాడిగా ఉండేది. దిబ్రూగఢ్ కీలక నదీ రేవుగా ఉండగా.. టీ, కలప తదితర వస్తువులు నదీ మార్గంలో రవాణా అయ్యేవి. 1947 దేశ విభజన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య పాత వాణిజ్య, నదీ సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడు దాదాపు 80 ఏళ్ల తర్వాత అదే చారిత్రక జలమార్గం కొత్త రూపంలో అంతర్జాతీయ వాణిజ్యానికి తెరుచుకోవడం ఈశాన్య భారత ఆర్థిక వ్యవస్థకు కీలక పరిణామంగా మారింది.
Watch Live: Flag-off of the first international Cargo Voyage from Dibrugarh to Dhaka via (NW-2) Brahmaputra. https://t.co/WUnsvoL556
— Ministry of Ports, Shipping and Waterways (@shipmin_india) October 5, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
