Lumpy Skin Disease: రెండు నెలలైనా అదుపులోకి రాని లంపీ చర్మవ్యాధి.. దేశ వ్యాప్తంగా 75 వేల గోవులు మృతి
రాజస్థాన్‌లోనే కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, యూపీలో జంతువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. రాజస్తాన్ రాష్ట్రంలో ఇప్పటివరకు 13 లక్షల 63 వేల జంతువులకు టీకాలు వేశారు
Lumpy Skin Disease: రాజస్థాన్‌లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు లంపీ చర్మవ్యాధి అదుపు కాలేదు. ఈ వ్యాధి వెలుగులోకి వచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా.. వ్యాధిని అదుపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. మరోవైపు దేశంలో సుమారు 75 వేల గోవు జంతువులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిని అంటువ్యాధిగా ప్రకటించలేదు. ఇదే విషయంపై రాజస్థాన్ ప్రభుత్వం పదేపదే కేంద్రానికి లేఖలు రాస్తోంది. కేవలం రాజస్థాన్‌లోనే కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, యూపీలో జంతువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి.
రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా మాట్లాడుతూ… రాష్ట్రంలోని పశువులలో వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అప్రమత్తం అయిందని.. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని పేర్కొన్నారు. జిల్లాలకు అవసరమైన మందులను త్వరితగతిన సరఫరా చేసేందుకు కాన్ఫెడ్ ను ఏర్పాటు చేసి.. పశువులకు త్వరిత గతిన వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 లక్షల 63 వేల జంతువులకు టీకాలు వేశారు. ప్రతాప్‌గఢ్, ఝలావర్ జిల్లాల్లో 1 లక్షకు పైగా జంతువులకు టీకాలు వేయబడ్డాయి.
రాష్ట్రంలో కోలుకున్న.. 7.73 లక్షల జంతువులు లంపి చర్మవ్యాధి నివారణ కోసం రాజస్థాన్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా గోవులకు లంపి నివారణకు టీకాలు వేస్తున్నాయని కటారియా తెలిపారు. రాష్ట్రంలో లంపి బారిన పడిన 13.63 లక్షల జంతువులలో ఇప్పటివరకు 12.49 లక్షల మందికి చికిత్స అందించగా, అందులో 7.73 లక్షల జంతువులు కోలుకున్నాయని పేర్కొన్నారు. మరోవైపు మరణించిన జంతువుల దహన విషయంలో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తున్నామని.. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితులు, స్థానిక సంస్థల నుంచి పూర్తి సహకారం అందుతోందన్నారు కటారియా.
పశువుల రైతులకు మందుల కిట్ అందజేత: సంబంధిత శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో లంపి వ్యాధిని త్వరగా నియంత్రించవచ్చని పశుశాఖ పాలనా కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. లంపి చర్మవ్యాధుల చికిత్స, ఫాలో-అప్ కోసం మందుల కిట్‌ను సిద్ధం చేసి పశువుల యజమానులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పశువైద్యులు, పశువుల సహాయకుల నియామకాలు టీకాల ప్రచారాన్నీ వేగవంతం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..