Karnataka Election Results: కర్నాటకలో కాంగ్రెస్ ‘మూడో ఆప్షన్’ అమలు చేస్తుందా? అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

కర్నాటక అధికార పీఠం కాంగ్రెస్‌ వశమైంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న సీఎంగా కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్నది? కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య ఉంది. ఎన్నికల సమయంలో ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీ తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా వ్యవహరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అనుసరించిన విధానాన్నే..

Karnataka Election Results: కర్నాటకలో కాంగ్రెస్ ‘మూడో ఆప్షన్’ అమలు చేస్తుందా? అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..
Karnataka Congress
Follow us
Shiva Prajapati

|

Updated on: May 13, 2023 | 5:45 PM

కర్నాటక అధికార పీఠం కాంగ్రెస్‌ వశమైంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న సీఎంగా కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందన్నది? కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య ఉంది. ఎన్నికల సమయంలో ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీ తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా వ్యవహరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అనుసరించిన విధానాన్నే కర్నాటకలోనూ కాంగ్రెస్‌ అనుసరించింది. కలిసికట్టుగా పనిచేయాలని, గెలిచిన తర్వాత సీఎంను డిసైడ్‌ చేద్దామని హైకమాండ్‌ ప్రకటించడంతో అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్‌ విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం శ్రమించారు. ఆ శ్రమకు ఫలితం దక్కింది. ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. కర్నాటకలో ఇద్దరు నేతలే పోటీలో ఉండగా హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం ముచ్చటగా ముగ్గురు నాయకులు సీఎం పదవి కోసం పోటీపడ్డారు. ఫలితాల తర్వాత అందర్ని కూర్చొబెట్టి కాంగ్రెస్‌ నేతలు ఎటువంటి తగువులు, అసమ్మతి తలెత్తకుండా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసింది. ఇప్పుడు కర్నాటకలో ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇద్దరే మాస్ లీడర్స్..

అవునన్నా కాదన్నా కర్నాటకలో ప్రస్తుతం ఇద్దరే మాస్‌ లీడర్లు. ఒకరు బీజేపీ నేత యడియూరప్ప అయితే, మరొకరు కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య. క్రియాశీల రాజకీయాల నుంచి యడియూరప్ప పక్కకు తప్పుకోవడంతో ఇక మిగిలిన పెద్ద మాస్‌ లీడర్‌ సిద్ధరామయ్యే. కర్నాటక సీఎం అయ్యేందుకు సిద్ధరామయ్యకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌. అదే సమయంలో కర్నాటకలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌లో కన్నడ ఓటర్లు అందరూ కూడా సీఎంగా మొదటి ఛాయిస్‌ సిద్ధరామయ్య అని తేల్చి చెప్పారు. ఆయనను సీఎం చేస్తే సహజంగానే అది కన్నడ ఓటర్ల ఆకాంక్షకు ప్రతిబింబమవుతుంది. కర్నాటకలో కాంగ్రెస్‌ నేడు అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం సిద్ధరామయ్యేనని కాంగ్రెస్‌లో అందరూ ఒప్పుకుంటారు. తన అహింద సిద్ధాంతంతో ఆయన మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులను కాంగ్రెస్‌ వైపు మళ్లించారు. ఇవన్నీ తనను సీఎం చేసేందుకు అర్హతలను సిద్ధరామయ్య చెప్తున్నారు.

ఆయనే బలమైన నేత..

అవునన్నా, కాదన్నా కర్నాటక కాంగ్రెస్‌లో నేడు బలమైన నేత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 2020లో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలోని 28 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ గెలిచింది కేవలం ఒక్క స్థానమే. అక్కడ గెలిచింది కూడా మరెవరో కాదు డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగా నిలవడం డీకే శివకుమార్‌కు ఉన్న పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఈడీ కేసులో శివకుమార్‌ను జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ వచ్చి పరామర్శించి వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను.

ఇవి కూడా చదవండి

అధిష్టానానికి కృతజ్ఞతలు..

కనకపురా నుంచి ఘన విజయం సాధించిన డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఎవరవుతారన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

అధికార విభజన?

కర్నాటక ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేపు బెంగళూరులో సమావేశమవుతున్నారు. హైకమాండ్‌ దూతగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా రానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే 3 పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య సీఎం కావడం, లేదా కాంగ్రెస్‌ సంప్రదాయం ప్రకారం సీఎంను నిర్ణయించమని హైకమాండ్‌ను కోరుతూ తీర్మానం చేయడం. రెండోది, డీకే శివకుమార్‌ చేసిన కృషి, పార్టీపట్ల ఆయనకున్న విధేయత ఆధారంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ డీకే శివకుమార్‌ను సీఎం చేయడం. ఇక మూడో సందర్భం ఏం ఉండొచ్చంటే.. సిద్ధరామయ్య, శివకుమార్‌ మధ్య అధికారాన్ని విభజించడం. చెరి రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండేలా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం. ఇందులో ఏదైనా సంభవించవచ్చు.

ఏం చేస్తారో మరి..

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక. ఇక్కడ నేతల మధ్య విభేదాలు చక్కదిద్దాల్సిన బాధ్యత ఖర్గేపైనే ఉంటుంది. మరి ఆయన ఏం చేస్తారు, ఎవరిని సీఎంను చేస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..