AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vice President Elections: తెరపైకి రాజకీయాలకు సంబంధం లేని అభ్యర్థి.. ఇండియా కూటమి వ్యూహం అదేనా..

హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార పార్టీ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసకుంది.. తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 9న భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Vice President Elections: తెరపైకి రాజకీయాలకు సంబంధం లేని అభ్యర్థి.. ఇండియా కూటమి వ్యూహం అదేనా..
B. Sudershan Reddy Cp Radhakrishnan
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 19, 2025 | 4:21 PM

Share

భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదట ఏకగ్రీవం అవుతుందని ప్రచారం జరిగింది.. కానీ.. అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపింది. అధికార విపక్ష పార్టీలు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ అభ్యర్ధులను ప్రకటించడంతో.. హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార పార్టీ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసకుంది.. తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 9న భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

ఎవరి వ్యూహం వారిదే..

బీజేపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేత.. మహారాష్ట్ర గవర్నర్, ఆర్ఎస్ఎస్ భావజాలం గల సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. కాగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలో విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. రాజకీయాలకు సంబంధం లేని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన NDAని అస్థిరపరిచేందుకు.. అలాగే.. ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరుకున పెట్టడానికి తీసుకున్న చర్యగా కనిపిస్తుంది..

వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తి ఎంపిక..

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ దక్షిణాది రాష్ట్రం తమిళ నాడు నుంచి ఎంపికైన తరువాత.. ఇండియా కూటమి అభ్యర్థి ఎక్కడి నుంచి ఎంపిక చేస్తారనేది.. ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో మరో తమిళుడికి అవకాశం ఇవ్వాలని.. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి ఇవ్వాలని ఇండియా కూటమిలో చర్చ జరిగింది. త్వరలో ఎన్నికలున్న తమిళనాడు, బీహార్, బెంగాల్ నుంచి అభ్యర్ధిని ఎంపిక చేసే అవకాశాలను ఇండియా కూటమి నేతలు పరిశీలించారు.. ఈ క్రమంలోనే.. అందరి నుంచి అభిప్రాయాలను తీసుకుని.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇండియా కూటమి.. చివరకు.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రానికి చెందిన.. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి(79) ని ఎంపిక చేసింది.

చంద్రబాబుతో సాన్నిహిత్యం..

సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంతోపాటు.. పలు పార్టీల మద్దతు కూడగట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, న్యూట్రల్‌గా ఉన్న వైసీపీ, బిఆర్ఎస్, బీజేడీ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది ఇండియా కూటమి.. సుదర్శన్ రెడ్డికి టిడిపితో సుదీర్ఘ కాలం అనుబంధం ఉంది. 1980, 1990లలో తన న్యాయవాద జీవితంలో, ఆయన అప్పటి టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండేవారు. టిడిపికి న్యాయపరమైన, చట్టపరమైన విషయాలలో సుదర్శన్ రెడ్డి సాయం అందించారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయాలతో సుదర్శన్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది.

సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీడీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ, సుదర్శన్ రెడ్డికి పార్టీతో చారిత్రాత్మక సంబంధం కారణంగా టీడీపీ ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క సుదర్శన్ రెడ్డికి మద్దతు కూడగట్టడానికి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే BRS, YSRCP వంటి తటస్థ పార్టీలతో పాటు TDPని సంప్రదిస్తున్నట్లు సమాచారం..

ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన టీడీపీ-జనసేన

ఇప్పటికే టీడీపీ – జనసేన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధా కృష్ణన్‌కు అధికారికంగా మద్దతు ప్రకటించాయి.. వైసీపీ అధినేత జగన్‌తో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. బిఆర్ఎస్ తమ నిర్ణయాన్ని కేసీఆర్ కి వదిలేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలకం కావడం, వెంకయ్య నాయుడు తర్వాత మరో తెలుగు వాడికి ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కినట్లుగా కాంగ్రెస్ తోపాటు.. పలు ప్రతిపక్షాలు చెబుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది వేచిచూడాల్సి ఉంది.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం.. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.. ఉస్మానియా యూనివర్సిటీలో(1971లో) చదివారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లు సుప్రీం కోర్టులో పని చేశారు. రిటైర్డ్‌ అయ్యాక.. గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. 2024 డిసెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ (IAMC) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.

సెప్టెంబర్ 9న భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక..

17వ భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సెప్టెంబర్ 9న జరగనుంది.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.. ఇప్పటికే ఆగస్టు 7 న కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారి చేసింది. ఆగస్టు 21వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. ఆగస్టు 22 నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. సెప్టెంబర్ 9న పార్లమెంట్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి..

ఎన్డీఏ అభ్యర్థికే గెలుపు అవకాశాలు!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉభయసభల ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీని, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్‌ లను ఈసీ నియమించింది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయసభలకు చెందిన 788 మంది ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీ గా ఉంటారు. ఉపరాష్ట్రపతి గెలుపు కోసం 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్‌డీఎకు 422 సభ్యుల మద్దతు ఉండటం వల్ల ఎన్డీఏ అభ్యర్థి గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. జులై 21 న ఆరోగ్య కారణాలతో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజీనామా చేశారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..