KK Survey on Haryana: ఏపీలో 100 శాతం కచ్చితమైన సర్వేతో సంచలనం రేపిన కేకే.. హర్యానా ఎన్నికల రిపోర్ట్..!

కేకే సర్వే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ గురించి పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలతో సరిగ్గా సరిపోలడంతో ఒక్కసారిగా ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది

KK Survey on Haryana: ఏపీలో 100 శాతం కచ్చితమైన సర్వేతో సంచలనం రేపిన కేకే.. హర్యానా ఎన్నికల రిపోర్ట్..!
Kk Survey On Haryana
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Sep 24, 2024 | 5:42 PM

కేకే సర్వే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ గురించి పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలతో సరిగ్గా సరిపోలడంతో ఒక్కసారిగా ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న హర్యానాతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ సర్వేలు నిర్వహింస్తోంది. వాటిలో వెల్లడైన ప్రజాభిప్రాయంతో ఆ సంస్థ అధినేత కొండేటి కిరణ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఒక ‘టైటానిక్ షిప్‌’లా తయారైందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం హర్యానాలో నెలకొన్న పరిస్థితి మాత్రమే కాదు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఘోర పరాజయాలతో చేదు అనుభవాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంకులో తేడా లేనప్పటికీ.. న్యూట్రల్ ఓటు బ్యాంకు మాత్రం తీవ్రంగా ప్రభావితమైందని సూత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలో తాజా పరిస్థితిపై ఆ సంస్థ అంచనాలేంటో ఓసారి చూద్దాం

మూడింట రెండు చోట్ల ఓటమి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రీ-పోల్ సర్వే నిర్వహించిన కేకే సర్వే సంస్థ ఆ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోనుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి మూడు సీట్లలో 2 చోట్ల ఓటమి ఖాయమని ఆ సంస్థ అధినేత కొండేటి కిరణ్ సూత్రీకరించారు. ఈ లెక్కన బీజేపీ కనీసం గట్టి పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. 5% ఓటు బ్యాంకు అటూ ఇటైతే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం వస్తుందని, అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు.

రైతులు, జాట్లే కీలకం

ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తులు కొన్ని ఉంటాయి. హర్యానాలో రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం రైతులు, వ్యవసాయ భూములు ఎక్కువగా కలిగి ఉన్న జాట్ సామాజికవర్గం ప్రజలే. ఢిల్లీని ఆనుకుని జరిగిన రైతు ఉద్యమంలో పంజాబ్ రైతులతో పాటు హర్యానా రైతులది కూడా కీలక పాత్ర. ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరు వారిలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. మరోవైపు జాట్ సామాజిక వర్గం చాలా కాలంగా బీజేపీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. ఈ సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితికి బీజేపీ చెక్ పెట్టింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు రైతుల ఆందోళన వ్యవహారం జాట్ రైతుల్లో మరింత ఆగ్రహాన్ని కల్గించింది.

దీనికితోడు మల్లయోధులు (పహిల్వాన్లు) కూడా ఈ వర్గానికి చెందినవారే ఎక్కువ. వినేశ్ ఫోగట్ వంటి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను అందించిన ఈ వర్గంలో రెజ్లర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరింత కోపానికి కారణమైంది. వినేశ్ ఫోగట్ సహా మరికొందరు క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలోకి కూడా దిగారు. ఈ కారణాలన్నీ బీజేపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తాయని కేకే సర్వే సంస్థ అభిప్రాయపడింది.

అభివృద్ధి కంటే అసంతృప్తే ఎక్కువ

రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాలు సహా వివిధ రకాల మౌలిక వసతుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టే బీజేపీ, ఈ రాష్ట్రంలో కూడా గణనీయంగా అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేసింది. గత 50-60 ఏళ్లతో పోల్చితే గత పదేళ్లలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధి ఇక్కడ ఎక్కువ. అయినా సరే ప్రజల్లో అసంతృప్తి ఉందని కేకే సర్వే పసిగట్టింది. అయోధ్యలో వీధులను విస్తరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు బీజేపీ సర్కారుపై దేశవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం ఏర్పడినా సరే.. విస్తరణలో భాగంగా ఇళ్లను, దుకాణాలను కోల్పోయిన స్థానికుల్లో మాత్రం వ్యతిరేకతే వ్యక్తమైంది. ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే ప్రతిఫలించి ఆ నియోజకవర్గంలో ఓటమి పాలైంది. వారికి తగిన పరిహారం, పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా జరిగిందని విశ్లేషణలు వచ్చాయి. హర్యానాలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూమి విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నది కొందరి విశ్లేషణ.

దీంతో పాటు రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే లతో రవాణా సదుపాయాలు మెరుగుపడినప్పటికీ.. దానిపై ప్రయాణించేవారిపై టోల్ ట్యాక్సుల రూపంలో పడే భారమే సామాన్యులకు కష్టంగా మారుతుంది. ఇది వారు నిత్యం ఎదుర్కొనే సమస్య. వీటికి తోడు జీఎస్టీ సహా అనేక రకాలుగా దోపిడీ గురవుతున్నామన్న భావన సామాన్య ప్రజల్లో ఎక్కువగా ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

బీజేపీపై వ్యతిరేకతే కాంగ్రెస్‌కి వరం

బీజేపీ ఓటమికి కారణాలెన్ని ఉన్నా సరే.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే వరంగా మారింది తప్ప కాంగ్రెస్ పట్ల ప్రత్యేక సానుకూలత ఏమీ లేదని కేకే సర్వే చెబుతోంది. అదే సమయంలో బీజేపీ కోర్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని కూడా ఆ సంస్థ వెల్లడించింది. దేశ రక్షణ, అభివృద్ధి వంటి అంశాలు సహా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభిమానించే వర్గాలు ఆ పార్టీతోనే కొనసాగుతాయని, ఏ పార్టీకీ చెందని న్యూట్రల్ ఓటు బ్యాంకు మాత్రం తీవ్రంగా ప్రభావితమైందని ఆ సంస్థ సూత్రీకరించింది. ఏ రాష్ట్రంలోనైనా ఓటుబ్యాంకులో కలిగే స్వల్ప తేడా సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి, భారత రాష్ట్ర సమితి (BRS)కు మధ్య ఓట్ల శాతంలో కేవలం 2% మాత్రమే వ్యత్యాసం ఉంది. కానీ సీట్ల సంఖ్యలో చూస్తే చాలా తేడా వచ్చింది. ఈ రాష్ట్రంలో కనీసం 5% న్యూట్రల్ ఓటుబ్యాంకు తారుమారైనా సీట్ల సంఖ్యలో చాలా తేడాను తీసుకొస్తాయని కొండేటి కిరణ్ చెబుతున్నారు.

కేజ్రీవాల్ ముందే విడుదలైతే..!

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే ఉమ్మడి లక్ష్యంగా చేతులు కలిపిన అనేక ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) పార్టీలు… కొద్ది నెలల్లోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్నాం. హర్యానాలో కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పొత్తుల కోసం జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ పార్టీ విడిగా దాదాపు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధపడింది. మరోవైపు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకతను ఈ పార్టీలు ఎంతో కొంత చీల్చుతాయని, తద్వారా అంతిమంగా బీజేపీ లబ్ది పొందుతుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

అయితే కేజ్రీవాల్ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండే అవకాశం లేదని కేకే సర్వే సంస్థ అభిప్రాయపడుతోంది. ఒకవేళ జైలు నుంచి కేజ్రీవాల్ కాస్త ముందే విడుదలై, ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సమయం గడిపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ, ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు మాత్రం ఆ పార్టీని ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్న భావనలో ఉన్నారని తెలిపారు. దీంతో వ్యతిరేక ఓటు చీలిక వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఏ రకంగా చూసినా కమలదళానికి హర్యానాలో సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోందన్న విషయం ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..