Parliament Winter Session: లోక్‌సభలో శుక్రవారం కీలక బిల్లు.. ఎంపీలందరికీ విప్ జారీ చేసిన బీజేపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీలు శుక్రవారం తప్పకుండా సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. సభలో ఓ ముఖ్యమైన బిల్లును ప్రవేశపెడుతామని , ఎంపీలు తప్పకుండా సభకు హాజరుకావాలని విప్ జారీ అయ్యింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీలు శుక్రవారం తప్పకుండా సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. సభలో ఓ ముఖ్యమైన బిల్లును ప్రవేశపెడుతామని , ఎంపీలు తప్పకుండా సభకు హాజరుకావాలని విప్ జారీ అయ్యింది. అయితే సభలో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెడుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డబ్బుకు ప్రశ్నల వ్యవహారం కేసులో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ నివేదికను శుక్రవారం లోక్‌సభలో సమర్పించబోతోంది. మహువాపై అనర్హత వేటు వేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో మిగతా విపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,చత్తీస్‌ఘడ్ అసెంబ్లీలో పార్టీ ఘనవిజయం సాధించడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో ఘనవిజయానికి ప్రధాని మోదీ నేతృత్వమే కారణమని ఎంపీలు నినాదాలు చేశారు. అయితే తాను సేవకుడిని మాత్రమే అన్నారు మోదీ.
బీహారీలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీహార్ DNA కన్నా, తమ DNA మెరుగైనదన్న తెలంగాణ CM రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశాన్ని దక్షిణ-ఉత్తర భాగాలుగా విడదీసే విచిత్రమైన ప్రణాళికకు కాంగ్రెస్ తెరదీసిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేస్తే, రాహుల్, సోనియా, ప్రియాంక స్పందించలేదన్నారు. పైగా రేవంత్ తన ప్రకటనను వెనక్కి తీసుకోలేదంటూ రవిశంకర్ ప్రసాద్ ఆక్షేపించారు. ‘తెలంగాణా సీఎంగా ఇవాళ ప్రమాణం చేసిన వ్యక్తి తన డీఎన్‌ఏ బీహారీల డీఎన్‌ఏ కంటే గొప్పదని అంటున్నాడు. అక్కడ ఓడిపోయిన సీఎం కేసీఆర్ డీఎన్‌ఏ బీహార్‌కు చెందిన కుర్మీ కులస్తులదని అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇంతకు దిగజారుతుందా ? రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్ నిన్ననే వచ్చింది. ఆయన ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ వెళ్లారు. కాని బీహారీలపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలని ఎందుకు చెప్పలేదు’ అని రవిశంకర్‌ప్రసాద్ ప్రశ్నించారు.
మరోవైపు బీజేపీ ఓట్ల కోసమే ఉత్తర,దక్షిణ భారత దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ అధిర్‌రంజన్ చౌదరి. దీనిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘బీజేపీ చాలా తెలివిగా ఉత్తర,దక్షిణ భారత ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా అన్యాయం. మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. 140 కోట్ల మంది భారతీయులంతా ఒక్కటే . వాళ్ల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం మంచిది కాదు’ అని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. మొత్తానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.నేతల మధ్య మాటలయుద్దం మరింత ముదురుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..