Aadhar Card: ఆధార్ కార్డుదారులకు కేంద్రం మరో శుభవార్త.. కొత్త ఏడాది వేళ బిగ్ అప్డేట్
ఆధార్ కార్డు సులువుగా పొందేందుకు వీలుగా యూఐడీఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నమోదు సెంటర్లను మరింతగా పెంచనుంది. ఇక పెద్దల కోసం ప్రత్యేక కేంద్రాల సంఖ్యను భారీగా పెంచనుంది. దీనికి సంబంధించి యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

ఆధార్ కార్డు వినియోగదారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. సులువుగా ఆధార్ పొందేలా, అప్డేట్ చేసుకునేలా అనేక సౌకర్యాలు కొత్తగా అందుబాటులోకి తెస్తోంది. సులువుగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడంతో పాటు పేపర్ లెస్ పద్దతిలో ధృవీకరణ చేసేలా ఈ ఏడాది అనేక మార్పులు అమల్లోకి తెచ్చింది. కుటుంబసభ్యుల ఆధార్ వివరాలన్నీ ఒకేచోట పొందుపర్చుకునేలా కొత్తగా మరో ఆధార్ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో యూఐడీఏఐ మరో శుభవార్త అందించింది.
పెద్దల కోసం మరికొన్ని పూర్తిస్తాయి ఆధార్ నమోదు కేంద్రాలను కొత్తగా నెలకొల్పనున్నట్లు UIDAI CEO భువనేష్ కుమార్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం వీటి సంఖ్య దేశవ్యాప్తంగా 88 ఉండగా.. 473కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2026 నాటికి వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వయోజనులు ప్రత్యేకంగా ఆధార్ సేవలు పొందేందుకు తక్కువ సెంటర్లు మాత్రమే ఉన్నాయని, వీరికి సహాయపడేలా కేంద్రాలను విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేంద్రాల్లో ఆధార్ నమోదు, సవరణ సేవలు అందిస్తామన్నారు. కొన్ని వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవచ్చని, కానీ బయోమెట్రిక్స్‌లో మార్పులు, ఒక నిర్ధిష్ట పరిమితి తర్వాత పేరు మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుందని భువనేష్ కుమార్ పేర్కొన్నారు.
వయోజనుల కోసం రెండు జిల్లాల్లో కనీసం ఒక ఆధార్ సెంటర్ ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు. ఇందుకోసం గూగుల్ సంస్థతో కలిపి పనిచేస్తున్నామని, త్వరలో ఆ సంస్థకు అధార్ సెంటర్ల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. అక్రమ వలసదారులు పెరుగుతున్న కారణంగా ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాతనే కొత్త ఆధార్ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వయోజన దరఖాస్తుదారుల్లో ఎక్కువగా ప్రవాస భారతీయులు లేదా భారతదేశంలోని విదేశీ పౌరులు ఉన్నారని అన్నారు. ఇండియాలో నివసించే విదేశీ పౌరులు ఆధార్ కలిగి ఉండటానికి అనుమతి లేదన్నారు. అటు ఆధార్ నమోదు చేసే సమయంలో పిల్లల పుట్టిన తేదీని తప్పుగా చెబితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చచించారు.
