Peanut Alert: గుప్పెడు దాటితే గుండెకు ప్రమాదం.. వేరుశెనగల విషయంలో జాగ్రత్త!
వేరుశెనగలు ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అధికంగా తీసుకోవడం లేదా సరిగా నిల్వ చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. మితంగా తీసుకుంటే మాత్రమే వీటి నిజమైన అ ప్రయోజనాలను అనుభవించవచ్చు,అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

వేరుశెనగలు, మనందరికీ ఎంతో ఇష్టమైన, రుచికరమైన స్నాక్. వీటిని పల్లీలు, పీనట్స్ అని కూడా పిలుస్తారు. రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు ఫైబర్ వంటి ఎన్నో కీలకమైన పోషకాలను అందిస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఈ గింజలను ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మోతాదులో తీసుకుంటే, కొన్ని ప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని కొన్ని అంశాలు, అలాగే నిల్వ చేసే విధానం సరిగా లేకపోతే అవి మన శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి, వేరుశెనగలను మితంగా తినడం, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం.
అతిగా వేరుశెనగలు తింటే కలిగే ప్రధాన నష్టాలు:
కాలేయానికి తీవ్ర నష్టం: సరిగా నిల్వ చేయని, తేమగా ఉన్న లేదా పాత వేరుశెనగల్లో ‘అఫ్లాటాక్సిన్’ అనే ఒక హానికరమైన ఫంగస్ పెరుగుతుంది. ఇది కాలేయానికి తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందుకే, పాతవి కాకుండా, ఎల్లప్పుడూ తాజా, పొడిగా ఉండే వేరుశెనగలను మాత్రమే తినాలి.
బరువు పెరగడం: వేరుశెనగలలో క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచివైనప్పటికీ, ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో అధిక క్యాలరీలు చేరి, బరువు వేగంగా పెరుగుతారు. బరువు నియంత్రణలో ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
జీర్ణ సమస్యలు: వేరుశెనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, అధికంగా తింటే జీర్ణవ్యవస్థపై భారం పడి జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, మరియు మలబద్ధకం వంటి ఇబ్బందులు వస్తాయి.
అలర్జీలు: కొంతమందికి వేరుశెనగ అలర్జీ ఉంటుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతు వాపు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించవచ్చు. ఇది ప్రాణాంతకం కావచ్చు కాబట్టి, అలర్జీ ఉన్నవారు పూర్తిగా దూరంగా ఉండాలి.
పోషకాల అసమతుల్యత: వేరుశెనగలో అధికంగా ఉండే ఫాస్ఫరస్, శరీరంలో జింక్, ఇనుము, మరియు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఆరోగ్యం కోసం వేరుశెనగలను తినాలనుకుంటే, ఒక రోజుకు గుప్పెడు (దాదాపు 30 గ్రాములు) మాత్రమే తీసుకుంటే మంచిది. వాటిని ఎల్లప్పుడూ పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. ముఖ్యంగా, ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.




