రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఉదయం లేవగానే అలసటగా, బద్ధకంగా ఉంటుందా..? రాత్రి సరిగా నిద్ర పోయినా ఉదయం ఉత్సాహం ఉండట్లేదా..? మీ రోజును చురుకుగా, సానుకూలంగా మార్చుకోవాలంటే.. మీ నిద్రవేళ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయాల..? భోజనం టైమింగ్, వంట పద్ధతి, స్క్రీన్ టైమ్‌పై నిపుణుల ముఖ్యమైన సలహాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా, రాత్రి మంచి నిద్ర ఉన్నప్పటికీ, ఉదయం లేవగానే మందకొడిగా, అలసటగా అనిపించడం చాలా మందికి సాధారణ సమస్య. నిద్ర లేకపోవడం, సరైన జీవనశైలి లేకపోవడం, పోషకాహార లోపం లేదా ఒత్తిడి వంటివి దీనికి కారణం కావచ్చు. ఉదయం బద్ధకాన్ని దూరం చేసి, రోజంతా చురుకుగా ఉండటానికి, రాత్రిపూట మన దినచర్యలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం ఉత్సాహంగా ఉండాలంటే.. రాత్రి పాటించాల్సిన అలవాట్లు
సరైన సమయానికి రాత్రి భోజనం
ఉదయం నీరసంగా అనిపించకుండా ఉండాలంటే.. సరైన సమయానికి రాత్రి భోజనం చేయడం ముఖ్యం. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య భోజనం చేయండి. దీనివల్ల మీరు పడుకునే సమయానికి మీ ఆహారం సరిగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సజావుగా ఉంటే నిద్ర ప్రశాంతంగా ఉంటుంది.
తేలికపాటి ఆహారం
మీ రాత్రి భోజనం ఎక్కువ నూనె, మసాలాలు ఉంటే.. అది జీర్ణం కావడం కష్టం. కడుపులో బరువు పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. అందుకే రాత్రి భోజనంలో పోషకాలు అధికంగా ఉండే.. కానీ తక్కువ నూనె, తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినండి.
నిద్రవేళను సెట్ చేసుకోండి..
మీ దినచర్యలో భాగంగా ఒక నిర్దిష్ట నిద్రవేళను నిర్ణయించుకోవాలి. కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు.. ప్రతి రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటలకు మేల్కొలపడం ఉత్తమం. ఈ అలవాటును పాటిస్తే కొద్ది రోజుల్లోనే ఉదయం ఉత్సాహంగా మేల్కొనడం గమనించవచ్చు.
తిన్న తర్వాత వాకింగ్..
భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాలు చిన్నగా నడవండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉదయం లేవగానే మీకు తేలికగా అనిపిస్తుంది. మగతను నివారిస్తుంది. నడవలేని పక్షంలో కొంత సమయం వజ్రాసనంలో కూర్చోవడం మంచిది.
స్క్రీన్ టైమ్ తగ్గించండి..
మంచి నిద్ర కోసం, పడుకునే ముందు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. రాత్రిపూట స్క్రీన్ చూడటం వల్ల ఒత్తిడి పెరిగి, నిద్ర దెబ్బతింటుంది. నిద్ర సరిగా లేకపోతే ఉదయం మీరు చురుకుగా ఉండలేరు. అది చిరాకుకు దారితీస్తుంది.
రాత్రిపూట అస్సలు తినకూడని.. తాగకూడనివి
- రాత్రిపూట కాఫీ, టీ లేదా ఇతర కెఫిన్ కలిగిన పానీయాలు.
- నూనె, కారంగా ఉండే ఆహారాలు.
- కార్బోనేటేడ్ లేదా చక్కెర పానీయాలు, స్వీట్స్.
- మీకు ధూమపానం లేదా ఆల్కహాల్ అలవాటు ఉంటే రాత్రిపూట వాటికి దూరంగా ఉండటం మంచిది.
మీ దినచర్యలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఉదయం బద్ధకాన్ని అధిగమించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




