Telangana: లాజిస్టిక్స్‌లో తెలంగాణ జోరు.. రేవంత్ సర్కార్ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు..
జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్ 2025లో తెలంగాణ రాష్ట్రం ‘హై పెర్ఫార్మర్’గా నిలిచి మరో కీలక మైలురాయిని చేరుకుంది. గతంలో అచీవర్ కేటగిరీలో ఉన్న తెలంగాణ.. ఈసారి మరింత మెరుగైన స్థాయికి చేరుకోవడం విశేషం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన LEADS-2025 నివేదికలో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, లాజిస్టిక్స్ రంగంలో తీసుకున్న చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించింది.

హైదరాబాద్: లాజిస్టిక్స్ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించి హై పెర్ఫార్మర్‌గా నిలిచింది. గతంలో అచీవర్ కేటగిరీలో ఉన్న తెలంగాణ, ఈసారి మరింత మెరుగైన స్థాయికి చేరుకోవడం విశేషంగా మారింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లీడ్స్-2025 నివేదికలో తెలంగాణ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వేగవంతమైన నిర్ణయాలే ఈ ఫలితానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల మధ్య పోటీలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంది. హర్యానా, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలతో సమానంగా నిలవడంతో పాటు మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు నివేదిక వెల్లడించింది. ప్రత్యేకంగా జలమార్గాల వినియోగంపై తెలంగాణ చూపుతున్న దృష్టిని కేంద్రం ప్రశంసించింది. గోదావరి, కృష్ణా, భీమా, మంజీరా, తుంగభద్ర వంటి జాతీయ జలమార్గాలను సరకు రవాణాకు ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నివేదికలో ప్రస్తావించారు.పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదు ఎకరాలను లాజిస్టిక్స్ మౌలిక వసతులకు కేటాయించే విధానాన్ని కూడా కేంద్రం ప్రశంసించింది. పరిశ్రమల అభివృద్ధితో పాటు రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది కీలక నిర్ణయంగా గుర్తించింది.
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి కేంద్రం ప్రశంసలు
ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చేపడుతున్న చర్యలు కూడా కేంద్ర దృష్టిని ఆకర్షించాయి. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ ద్వారా పరిశ్రమలకు అనుసంధానమైన కోర్సులు ప్రారంభించి యువతకు శిక్షణ అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మొదటి ఏడాదిలోనే 500 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం రాష్ట్ర దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణించింది.
వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ సేవలకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఇక నల్లగొండ జిల్లా చిట్యాలలో రూ.750 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్, మెదక్ జిల్లాలో ప్రతిపాదించిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, నిజామాబాద్‌లో ఐసీడీ ప్రాజెక్ట్ వంటి పలు కార్యక్రమాలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరింత బలం చేకూర్చనున్నాయి.
రవాణా రంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకెళ్తోందని తాజా నివేదిక మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
