AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకానికి కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా..! రూ.5 వేల కోట్ల సమీకరణకు కేంద్రం సిద్ధం

కోల్ ఇండియాలోని 2 శాతం వరకు వాటాను కేంద్ర ప్రభుత్వం OFS ద్వారా విక్రయించనుంది. ఒక్కో షేరుకు రూ.412 ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించగా, దీని ద్వారా సుమారు రూ.5,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు మే 27న, రిటైల్ ఇన్వెస్టర్లకు మే 29న ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

అమ్మకానికి కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా..! రూ.5 వేల కోట్ల సమీకరణకు కేంద్రం సిద్ధం
Coal India
SN Pasha
|

Updated on: May 27, 2026 | 7:21 AM

Share

ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌లోని తన వాటాలో 2 శాతం వరకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఈ షేర్ల విక్రయం మే 27 నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు కనీస ధరను రూ.412గా నిర్ణయించగా, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.5,000 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఓఎఫ్‌ఎస్‌లో మొదటిగా కంపెనీ ఈక్విటీలో 1 శాతం వాటాను విక్రయిస్తారు. అదనపు డిమాండ్ వచ్చిన పక్షంలో మరో 1 శాతం వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద విక్రయించే అవకాశం ఉంది.

మొత్తం మీద దాదాపు 123.2 మిలియన్ షేర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు మే 27న, రిటైల్ ఇన్వెస్టర్లకు మే 29న ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి అరుణిష్ చావ్లా సోషల్ మీడియా వేదిక ఎ‍క్స్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కోల్ ఇండియా బలమైన ఆర్థిక పనితీరు, స్థిరమైన లాభాలు, ఆకర్షణీయమైన డివిడెండ్లతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం బీఎస్‌ఈలో కోల్ ఇండియా షేర్ ధర రూ.458.25 వద్ద ముగిసింది. దీంతో OFS ఫ్లోర్ ప్రైస్ ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 10 శాతం తక్కువగా ఉండటం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. సాధారణంగా ఇటువంటి డిస్కౌంట్ ధరలు రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపడుతున్న రెండో ప్రధాన OFS ఇదే. ఇటీవల సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోని 8.08 శాతం వాటాను విక్రయించి కేంద్రం రూ.2,266 కోట్లు సమీకరించింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ద్వారా మొత్తం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత సవరించిన అంచనాలతో పోలిస్తే రెట్టింపుకు పైగానే ఉండటం గమనార్హం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us