Blood Type Diet: బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం తింటే అద్భుతాలు జరుగుతాయా? ఇది నిజంగా నిజమేనా?
ప్రతి ఒక్కరికి రక్త వర్గం ఉంటుంది. O+, O-, A+, A-, B+, B-, AB+, AB- అనే 8 రకాల రక్త సమూహాలలో ఏదో ఒకటి కలిగి ఉంటారు. అవి వారి స్వంత ప్రత్యేక లక్షణాలను..
ప్రతి ఒక్కరికి రక్త వర్గం ఉంటుంది. O+, O-, A+, A-, B+, B-, AB+, AB- అనే 8 రకాల రక్త సమూహాలలో ఏదో ఒకటి కలిగి ఉంటారు. అవి వారి స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. అనేక అధ్యయనాలు రక్తం రకాలు, గుండె జబ్బుల ప్రమాదానికి గల సంబంధాలను అన్వేషించాయి. దోమలు సదరు బ్లడ్ గ్రూప్ వారినే కుట్టడం వంటి అంశాలపైనా అధ్యయనం చేశారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని ముందుకు తీసుకువచ్చారు పరిశోధకులు. బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
‘ఈట్ రైట్ ఫర్ యువర్ టైప్’ అనే పుస్తకంలో ప్రముఖ వైద్యుడు పీటర్ డి అడమో బ్లడ్ గ్రూప్ ఆధారిత డైట్ ను పరిచయం చేశాడు. దీని ప్రకారం.. తినే ప్రతి ఆహారం ఒకరి రక్త వర్గంతో రసాయనికంగా ప్రతిస్పందిస్తుంది. అంటే సంబంధిత బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం తీసుకుంటే.. మరింత ప్రభావవంతంగా జీర్ణమవుతుంది. శరీరానికి సరైన ప్రయోజనాలను అందిస్తుంది.
డీఅడమో ప్రకారం ఏ బ్లడ్ గ్రూప్ ఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
A..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు మాంసం ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోకూడదు. వీరి ఆహారంలో పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే రకం A రక్తంలో ‘సున్నితమైన రోగనిరోధక వ్యవస్థ’ ఉంటుంది.
B..
ఈ బ్లడ్ గ్రూప్ వారు ఆకుపచ్చ కూరగాయలు, గుడ్లు, కొన్ని మాంసాలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవాలి. మొక్కజొన్న, గోధుమలు, బుక్వీట్, కాయధాన్యాలు, టమోటాలు, వేరుశెనగలు, నువ్వులు తినడం మానుకోవాలి. నాన్‌వెజ్‌లో చికెన్‌కు దూరంగా ఉండాలి.
AB..
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు సీఫుడ్, టోఫు, డైరీ, బీన్స్, ఆకుకూరలు, ధాన్యాలను తీసుకోవాలి. కానీ మొక్కజొన్న, బీఫ్, చికెన్‌కు దూరంగా ఉండాలి. AB బ్లడ్ గ్రూప్ వారి కడుపులో అమ్లం తక్కువగా ఉంటుంది. కెఫిన్, ఆల్కహాల్, ఫ్రై చేసిన ఆహారాలు అస్సలు తీసుకోవద్దు.
O..
ఈ రక్త వర్గానికి చెందిన వారు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినవచ్చు. లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, కూరగాయలు తీసుకోవచ్చు. ధాన్యాలు, బీన్స్, పాలు కూడా తీసుకోవచ్చు.
పరిమితులున్నాయి..
బ్లడ్ టైప్ డైట్ విషయానికి వస్తే అనేక పరిమితులు ఉన్నాయి. ఖచ్చితంగా పాటించడం అనేది సాధ్యపడని పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఈ కఠినమైన డైట్‌ను పాటించలేరు. ఉదాహరణకు డయాబెటిక్ పేషెంట్లకు ఈ డైట్ పనిచేయదు. ఈ నేపథ్యంలోనే.. డి అడమో పుస్తకంలో ఈ డైట్ ఆరోగ్యాన్ని పెంచుతుందని చెప్పినప్పటికీ.. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్ మాత్రం ఇందుకు సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..