Eye Reveals: గుండె పనితీరును కంటి పరీక్షతో తెలుసుకోవచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి
Eye Reveals: ప్రతి ఒక్కరికి కళ్లు ఎంతో ముఖ్యం. ఈ కళ్ల ద్వారానే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అలాంటి వాటికి ఏదైనా సమస్య వచ్చి పడితే చాలా ఇబ్బంది పడాల్సి..
Eye Reveals: ప్రతి ఒక్కరికి కళ్లు ఎంతో ముఖ్యం. ఈ కళ్ల ద్వారానే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అలాంటి వాటికి ఏదైనా సమస్య వచ్చి పడితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే కళ్లు జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం.చూపును ప్రసాదించేవే కాకుండా మనలో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఇట్టే పట్టేస్తాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. కంటిని స్కాన్ చేయడం ద్వారా గుండె ఆరోగ్యం గురించి విషయాలను చెప్పవచ్చంటున్నారు పరిశోధకులు. కంటిలోని రక్తప్రసరణ వ్యవస్థ ఆధారంగా పలు వ్యాధులను గుర్తించవచ్చునని స్పష్టం చేస్తున్నారు. సాధారణ కంటి పరీక్ష గుండె జబ్బు ప్రమాదాన్ని తెలియజేస్తుంది. ఈ పరీక్షలో మనిషికి గుండె జబ్బుతో పాటు పక్షవాతం వచ్చే ప్రమాదం ఎంత ఉన్నదో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కంటి రెటీనాను పరిశీలించడం ద్వారా..
అమెరికన్ పరిశోధకులు కంటి రెటీనాను పరిశీలించడం ద్వారా కంటిలో రక్త ప్రసరణ ఎంత తక్కువగా ఉన్నదో చెప్పవచ్చని, ఇదే విషయం గుండె జబ్బులను కూడా సూచిస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. శరీరంలో రక్త ప్రసరణ తగ్గినప్పుడు, తగినంతగా లేని సమయంలో కంటిలో ఉండే రెటీనా కణాలను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తేల్చారు. వీరి పరిశోధన ప్రకారం.. రెటీనాను పరీక్షించడం ద్వారా స్కీమియా అనే గుండె జబ్బును గుర్తించవచ్చు. స్కీమియా పరిస్థితిలో ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి ధమనులు దెబ్బతిని ప్రమాదస్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్‌లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చునని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రెటీనా సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాథ్యూ బెక్హాం అభిప్రాయపడుతున్నారు. రెటీనా పరీక్షలో స్కీమియా లక్షణాలను చూపించే రోగులను కార్డియాలజిస్టుల వద్దకు పంపాలని ఇక్కడి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.
పరిశోధన ఎలా సాగింది..
రెటీనా నుంచి కంటి వ్యాధులను అర్థం చేసుకునేందుకు పరిశోధకులు 13,940 మంది రోగులపై ఈ పరిశోధన చేపట్టారు. వీరి కంటి రెటీనాలను 2014 జూలై-2019 జూలై మధ్య పరీక్షించారు. ఈ పరీక్షలో 84 మందిలో గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ 84 మందిలో నిజంగానే 58 మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. 26 మంది రోగులకు స్ట్రోక్‌కు గురయ్యారు. ఈ రెండు వ్యాధులు కూడా రక్తప్రసరణకు సంబంధించినవే కావడం విశేషం. ఇలాంటి పరిశోధన చేపట్టడం ద్వారా ఎన్నో కీలక విషయాలను గుర్తించారు. కంటి ద్వారా కూడా ఇతర జబ్బులను గుర్తించవచ్చని పరిశోధకులు తేల్చారు.