Oral Cancer: మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ కావాల్సిందే.. నోటి క్యాన్సర్‌కు సంకేతాలివే..!
నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే అది మరింత ముదిరి ప్రాణాంతకం అవుతుంది. అయితే ప్రారంభంలోనే ఈ సంకేతాలను గుర్తించి తగిని చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మానవ శరీరంలో వివిధ రకాల క్యాన్సర్‌లు ప్రాణాంతకంగా మారతాయి. వీటిలో నోటి క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే అది మరింత ముదిరి ప్రాణాంతకం అవుతుంది. అయితే ప్రారంభంలోనే ఈ సంకేతాలను గుర్తించి తగిని చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్లు మీ నాలుకపై లేదా నాలుక కింద అభివృద్ధి చెందుతాయి. నోరు, చిగుళ్ళను కప్పే కణజాలం, అలాగే నోటి వెనుక గొంతు ప్రాంతంలో వృద్ధి చెందుతాయి. ఈ క్యాన్సర్ మీ నోటిలోని వివిధ సంకేతాల ద్వారా కనిపించవచ్చు. దీని గురించి సకాలంలో తెలుసుకుంటే రోగ నిర్ధారణ, చికిత్సలో సహాయపడుతుంది. ప్రతి నెలా కనీసం ఒక్కసారైనా మీ నోటిని పరిశీలించి మీ నోట్లో ఎర్రటి పుండ్లు ఉన్నాయా? అని చూడడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నోటి క్యాన్సర్‌ను సూచించే ఆ సంకేతాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
నోట్లో గడ్డలు, వాపు, పూత
ఇవి నోటి క్యాన్సర్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన సంకేతం. మీ నోరు, దవడ లేదా మెడలో ఎక్కడైనా సంభవించే ముద్ద లేదా వాపు, మెడలోని శోషరస గ్రంథుల్లో ఏవైనా స్థిరమైన గడ్డలు కనిపించకుండా పోయినా విస్మరించకూడదు. ముఖ్యంగా మీరు డాక్టర్‌తో తనిఖీ చేయించుకోవాలి. అలాగే నోటిలో ఎక్కడైనా అల్సర్లు లేదా ఎరుపు లేదా తెలుపు పాచెస్ ఉన్నాయా? అని కూడా తరచూ తనిఖీ చేయాలి. ఈ సంకేతాలు కేవలం నోటి క్యాన్సర్ వల్ల మాత్రమే సంభవిస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇవి సకాలంలో తగ్గకపోతే మాత్రం మీ వైద్యునితో తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.
గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది
ఆహారాన్ని మింగడం, ఆహారాన్ని నమలడం లేదా దవడ లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బందిని అనుభవించడం కూడా నోటి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. మీకు దీర్ఘకాలిక గొంతునొప్పి లేదా మీ గొంతులో బొంగురుపోవడం ఆరు వారాల కంటే ఎక్కువ ఉంటే మీరు మరింత ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులు కలవడం ఉత్తమం.



తిమ్మిర్లు, పళ్లు ఊడిపోవడం
నాలుక లేదా నోటిలోని ఏదైనా ఇతర ప్రాంతంలో తిమ్మిరిని అనుభవించడం కూడా నోటి క్యాన్సర్‌కు సంకేతం. మీ గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు కూడా మీకు అనిపించవచ్చు. అలాగే, స్పష్టమైన కారణం లేకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పళ్ళు వదులుగా మారినా అలాగే ఊడిపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ లక్షణాల్లో దేనినైనా మూడు వారాల కంటే ఎక్కువ కాలం నుంచి అనుభవిస్తుంటే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేస్తే, పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.