AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard: చిరుత ఎదురుపడినప్పుడు ఏం చేయాలి..?

ఒకరోజు ఇక్కడ.. మరుసటి రోజు అక్కడ.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులల సంచారం గురించి పదే, పదే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో చిరుతలు ఎదురైనప్పుడు ఎలా ప్రతిఘటించాలి, ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం ...

Leopard: చిరుత ఎదురుపడినప్పుడు ఏం చేయాలి..?
Leopard
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2026 | 7:47 PM

Share

అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు.. జనాల్లోకి వస్తూ.. తెగ కంగారు పెట్టేస్తున్నాయి. ఎక్కడో అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే పులులు, చిరుతలు.. ఇటీవల ఏకంగా పట్టణ ప్రాంతాల్లోనూ అలజడి సృష్టిస్తున్నాయి. ఏకంగా.. మనుషులు.. పశువులపై దాడులు చేస్తూ దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధీనగర్‌ శివారులో చిరుత సంచారంపై కలకలం రేపింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ చిరుతల భయం వెంటాడుతోంది. అయితే చిరుతలు ఎదురైనప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటవీ శాఖ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. చిరుతపులి కనిపించిన సందర్భాన్ని బట్టి స్పందించే తీరు మారుతుంది. అది దూరంలో ఉండి, మనల్ని అంతగా డిస్టర్బ్ చేయనట్లయితే వేరుగా, అది దాడి చేసేంత దగ్గరగా (క్లోజ్ ఎన్‌కౌంటర్) ఉన్నప్పుడు వేరుగా ప్రవర్తించాలి.

క్లోజ్ ఎన్‌కౌంటర్ అయితే: చిరుత దాడి చేసేంత దగ్గరగా ఉన్నప్పుడు, గట్టిగా అరుస్తూ, చేతులను పైకి లేపి గాలిలో ఊపాలి. ఇలా చేయడం వల్ల చిరుతకు మనకంటే ఎత్తైన, పెద్ద జంతువు ఏదో ఉందని భ్రమ కలిగి, అది వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చిరుత కళ్ళలోకి చూస్తూ ఉండాలి. ముఖ్యంగా, పరిగెత్తడం, కూర్చోవడం లేదా పొదల చాటున దాక్కోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే చిరుతపులి మనల్ని చిన్న జంతువుగా లేదా హెర్బివోరస్‌గా భావించి దాడి చేసే ప్రమాదం ఉంది. చిరుత సాధారణంగా వెనుక నుంచి దాడి చేయడానికి ఇష్టపడుతుంది. అందువల్ల, దానిని ఎదుర్కొంటూ నెమ్మదిగా వెనక్కి జరగాలి.

దాడి తప్పనిసరైతే ఏం చేయాలి?:

అన్ని ప్రయత్నాలు చేసినా చిరుత దాడి తప్పదనుకున్నప్పుడు, ప్రతిఘటించడం తప్ప వేరే మార్గం ఉండదు. పులితో పోలిస్తే చిరుతపులి చాలా చిన్నది. పులి 400 కిలోల పైన ఉంటే, చిరుత 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. దీని వల్ల దాని శక్తి తక్కువగా ఉంటుందని, కొంతవరకు ప్రతిఘటించే అవకాశం ఉంటుంది. చిరుతపులి ప్రధానంగా మెడపై దాడి చేస్తుంది. మెడను, తలను రక్షించుకుంటూ ప్రతిఘటించగలిగితే, కొన్ని గాయాలు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దాని నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు చిరుత దాడులను ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలు కాపాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి ఎంతో సమయస్పూర్తి, ధైర్యం, శారీరక, మానసిక స్థైర్యం అవసరం.

చిరుతపులులు తిరిగే ప్రదేశాల్లో కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించాలి.

వెనక మాస్క్ ధరించడం: చిరుతపులి ఎప్పుడూ వెనుక నుండి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు, ఇతర కార్మికులు వెనకవైపు ఫేస్ మాస్క్ ధరించడం వల్ల అది మనిషి అని సందేహించి దాడి చేయకుండా వెనకడుగు వేస్తుంది.

గుంపులుగా ప్రయాణించడం: కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు గుంపులుగా వెళ్తే చిరుత దాడి చేసే అవకాశం 99% తగ్గుతుంది. ఒంటరిగా వెళ్లేటప్పుడు దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువ.

శబ్దం చేయడం: నడుస్తున్నప్పుడు శబ్దం చేయడం వల్ల చిరుతపులులు దూరంగా ఉంటాయి.

నిప్పు: మంట లేదా నిప్పు వెలిగించడం వల్ల కూడా చిరుతపులులు దరిదాపులకు రావు. గిరిజనులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

చిరుతపులుల స్వభావం గురించి కొన్ని విషయాలు: ఇవి పిల్లి జాతికి చెందినవి. ప్రతి చిరుతపులికి దాని శరీరంపై చుక్కలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒకే రకం చుక్కలు వేరే చిరుతకు ఉండవు. ఇవి సాధారణంగా సిగ్గుపడే జంతువులు. మనుషులకు చాలా తక్కువగా కనిపిస్తాయి.  చిరుతపులులు ఒంటరిగా జీవిస్తాయి. పిల్లలతో ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పెద్దయ్యే వరకు వాటితో ఉంటాయి. సాధారణంగా రాతి నిర్మాణాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండటానికి ఇష్టపడతాయి. చిరుతపులులు చాలా అరుదుగా మనుషులను తినేవిగా మారతాయి. అవి తమను తాము రక్షించుకోవడానికి దాడి చేస్తాయి తప్ప, ఆహారం కోసం లేదా తినడం కోసం మనుషులపై దాడి చేయడం చాలా అరుదు.

Also Read: పులి ఎదురుపడినప్పుడు ఏం చేయాలి.. ?

Follow Us