AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wildlife: పులి ఎదురుపడినప్పుడు ఏం చేయాలి.. ?

పులి ప్రవర్తన, వేట పద్ధతులు, టెరిటరీ మార్కింగ్ గురించి IFS అధికారిణి శ్వేత బొడ్డు కీలక వివరాలు వెల్లడించారు. పులికి ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయకూడదో ఆమె వివరించారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం .. ..

Wildlife: పులి ఎదురుపడినప్పుడు ఏం చేయాలి.. ?
Tiger
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2026 | 1:34 PM

Share

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో పులుల టెర్రర్ చూస్తూనే ఉన్నాం. జనావాసాల్లోకి వచ్చి ఆవులు, గేదెలు, గొర్రెలపై అవి దాడి చేస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లావాసులను భయట్టిన పెద్దపులిని చౌకచక్యంగా బంధించిన అధికారులు.. దాన్ని విశాఖ జూకి తరలించి మోనిటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుల ప్రవర్తన, వేట పద్ధతులు, వాటి భూభాగాన్ని గుర్తించే విధానాలు, అటవీ ప్రాంతాల్లో పులితో ఎదురుపడినప్పుడు అనుసరించాల్సిన భద్రతా చర్యలపై IFS అధికారిణి శ్వేత బొడ్డు ఓ ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు. పులి ఒక అద్భుతంగా వేటాడే జీవి అయినప్పటికీ, దాని వేట సక్సెస్ రేటు మనం అనుకున్నంత ఎక్కువగా ఉండదు. పది ప్రయత్నాల్లో కేవలం ఒకసారి మాత్రమే పులికి విజయం దక్కుతుంది, అంటే దాని సక్సెస్ రేటు సుమారు 10 శాతం మాత్రమే. ఈ కారణంగా, పులి తన వేటలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. చిన్న జింకలు లేదా కుందేళ్ల వంటి చిన్న జంతువులపై దాడి చేయడం వల్ల లభించే శక్తి, వేట కోసం వెచ్చించే శక్తితో సరిపోలదని పులికి తెలుసు. అందుకే, పులులు గౌర్ వంటి పెద్ద జంతువులను వేటాడటానికి ప్రాధాన్యతనిస్తాయి. గౌర్ చూడటానికి భారీగా ఉండటంతో పాటు, దాని మాంసం ఎక్కువ రోజులు పులికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఒకసారి వేటాడిన తర్వాత, పులి పది రోజుల వరకు మళ్లీ వేటాడకుండా ఉండగలుగుతుంది.

సాధారణంగా ఒక పులి నెలకు మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే వేటాడుతుంది. తల్లి పులి.. పిల్లలు ఉన్నప్పుడు, అవి ఉన్న ప్రదేశం నుంచి ఆహారం కోసం వెళ్లి, వేటాడి తీసుకువచ్చి పిల్లలకు తినిపిస్తుంది. పులి తన ఆహారాన్ని ఇతర జంతువులు వచ్చి తింటాయనే భయంతో దాచిపెట్టదు. అది తిన్న తర్వాత మిగిలిపోయిన దానిని నక్కలు, హైనాలు తింటాయి. పులులు అత్యంత టెరిటోరియల్ జంతువులు. అవి తమ భూభాగాన్ని గుర్తించడానికి, రక్షించుకోవడానికి అనేక పద్ధతులను అనుసరిస్తాయి. యూరిన్‌ను స్ప్రింగ్ చేయడం ద్వారా తమ టెరిటరీని మార్క్ చేస్తాయి. పులి అటవీ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు, ప్రతి కొద్ది దూరానికీ యూరిన్‌ను విడుదల చేస్తూ తన భూభాగాన్ని గుర్తిస్తుంది. చెట్ల బెరడుపై తమ గోళ్ళతో గీతలు పెట్టడం కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ఒక పద్ధతి. ఒక పులి ఎంత బలంగా ఉంటే, అది అంత పెద్ద భూభాగాన్ని తనదిగా చెప్పుకుంటుంది. ఈ వాసన గుర్తులు ఇతర పులులకు హెచ్చరికగా పనిచేస్తాయి.. ప్రత్యేకించి ఇతర మగ పులులకు. ఒకవేళ వేరే పులి ఆ భూభాగంలోకి వస్తే, ఈ వాసనల ద్వారానే వాటి మధ్య సంఘర్షణలు, టెరిటోరియల్ ఫైట్లు ఏర్పడతాయి. ఆడ పులులు మాత్రం ఒకరి భూభాగంలోకి మరొకరు ప్రవేశించడం సాధారణమే.

పులితో అనుకోకుండా ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్వేత బొడ్డు వివరించారు. పులులు, ఇతర వన్యప్రాణులు కూడా, అవసరం లేనిదే మనుషులపై దాడి చేయవు.  దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు తప్పుకుంటుంది. అలాంటి సమయంలో దాడి చేసే ఉద్దేశం ఉండదు.  దగ్గరగా ఎదురుపడితే.. అది ఎటాక్ చేసే చాన్సులు ఎక్కువ. ఆ సందర్భంలో వంగడం, కూర్చోవడం లేదా పొదల్లో దాక్కున్నట్లు కనిపించడం వంటి చర్యలు పులికి మనం బలహీనమైన ఆహారం అని అనిపించవచ్చు. అలాంటి వాటిని నివారించాలి.  అనుకోకుండా పులికి ముఖాముఖి ఎదురైనప్పుడు, భయపడి అరవడం, పరుగెత్తడం లేదా వంగడం వంటివి ఏవీ చేయకూడదు. నిశ్చలంగా నిలబడి ఉండటమే సరైన చర్య. దీనివల్ల పులికి మనం ఆహారం కాదనే స్పష్టమైన సందేశం అందుతుంది. మనుషులు పెద్దగా కనిపించినప్పుడు పులులు.. వేటాడటానికి వెనుకాడతాయి. ఉదాహరణకు ఎలుగుబంటి పులికి ఎదురైనప్పుడు, అది రెండు కాళ్లపై నిలబడి తనను తాను పెద్దదిగా చూపించుకుంటుంది. అప్పుడు పులి వెనక్కి తగ్గుతుంది. అడవి జంతువుల మైండ్ సెట్ పరిశీలిస్తే ఆకారంలో తమకంటే పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా దాడికి దిగవు.

సో నిపుణుల వివరాల ప్రకారం.. పులి కనిపించినప్పుడు కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, కదలకుండా నిలబడాలని, కదలికలను తగ్గించుకోవాలట. ఎదురుగా ఉన్న జీవి తనను చూస్తుందని పులి భావించినప్పుడు, అది తాను తినే వస్తువు కాదని భ్రమించి పక్కకు వెళ్లిపోతుందట. పులి దృష్టి మళ్లిన తర్వాత నెమ్మదిగా వెనక్కి నడిచి, వీలైతే చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలని, ఎందుకంటే పులులు చెట్లు అంత బాగా ఎక్కలేవు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us