Preity Zinta: ‘మేడమ్ మీరు ఆ పార్టీలో చేరుతున్నారా?’ నెటిజన్‌కు ప్రీతి జింటా ఘాటు రిప్లై.. ఆపై క్షమాపణలు
సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడీ అందాల తార రాజకీయాల్లోకి రానుందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రీతి చాలా ఘాటుగా సమాధానమిచ్చింది.

ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార తెలుగులోనూ నటించి మెప్పించింది. ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. కానీ ఇప్పుడు ఆ నటి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన ఫాలోవర్లతో కలిసి ఓ ఛాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ వేసిన ప్రశ్నతో ప్రీతికి చిర్రెత్తుకొచ్చింది. ‘ మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ సదరు నెటిజన్ ప్రీతి జింటాను ప్రశ్నించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ప్రీతి.
‘నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సామాజిక మాధ్యమాలతో తరచూ వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళితే బీజేపీలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో మన దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నాను. ఆచరిస్తున్నాను. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నాను. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. అయినా దురదృష్టవశాత్తూ నాపై తరచూ విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా’ అని ప్రీతి ఆన్సర్ ఇచ్చింది.
అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు కూడా ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్లు ప్రీతి జింటాపై మండిపడుతున్నారు. తరువాత, ఒక అభిమాని నటిని, ‘ పంజాబ్ కింగ్స్ కాకుండా, మీకు ఏ జట్టు బాగా ఇష్టం?’ అని అడిగాడు. దీనికి నటి, ‘అది చాలా మంచి ప్రశ్న’ అని అంది. ‘నేను నా భర్తను అమితంగా ప్రేమిస్తున్నానని చెబుతాను. కాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టే ఎప్పటికీ నాకు ఇష్టమైన జట్టుగా ఉంటుంది’ అని ప్రీతి సమాధానమిచ్చింది.
ఇంటర్వ్యూలో ప్రీతి జింటా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








