AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu Elections: తెలుగు వారికి బీజేపీ గాలెం.. రంగంలోకి కిషన్‌రెడ్డి.. దినకరన్‌ కూటమిలోకి ఓవైసీ పార్టీ

తమిళనాడులో రాజకీయ పొత్తులకు తనదైన శైలిలో ముగింపు నిచ్చిన బీజేపీ అధినాయకత్వం.. ఓట్లను కొల్లగొట్టేందుకు మార్గాలను వెతుకుతోంది. మరోవైపు తమిళనాట తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఎంఐఎం పార్టీ పొత్తును ఖరారు చేసుకుంది.

Tamilnadu Elections: తెలుగు వారికి బీజేపీ గాలెం.. రంగంలోకి కిషన్‌రెడ్డి.. దినకరన్‌ కూటమిలోకి ఓవైసీ పార్టీ
Rajesh Sharma
|

Updated on: Mar 08, 2021 | 7:44 PM

Share

BJP for Telugu votes in Tamilnadu state:  తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తనకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఆ మార్గాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. తమిళనాడులో రాజకీయ పొత్తులకు తనదైన శైలిలో ముగింపు నిచ్చిన బీజేపీ అధినాయకత్వం.. ఓట్లను కొల్లగొట్టేందుకు మార్గాలను వెతుకుతోంది. అన్నా డిఎంకేతో పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీ.. ఉప ఎన్నిక జరుగుతున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కూడా బరిలోకి దిగింది. మాజీ కేంద్ర మంత్రిని అక్కడ పోటీకి దింపింది. శశికళను వ్యూహాత్మకంగా తెరచాటుకు పంపిన బీజేపీ ఇక ప్రచారంపై దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి అమిత్ షా నిర్దేశిస్తున్న మార్గంలో తమిళనాడు బీజేపీ నేతలతోపాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఇంచార్జిలుగా నియమించిన కిషన్ రెడ్డి తదితరులు ముందుకు సాగుతున్నారు.

తాజాగా తమిళనాడులోని తెలుగు ఓటర్లపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారింది. వీరి ఓట్లు రాబట్టే వ్యూహంతో తెలుగువాడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నాయుడు, పేరవై వర్గాలు తెలుగు వారిగా గుర్తింపు పొందాయి. దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వెళ్ళి స్థిరపడిన ఈ తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ తమ ఇళ్ళలో తెలుగు మాట్లాడుతుంటారు. తెలుగు ఓట్లపై దృష్టి పెట్టాలన్న అమిత్‌ షా సూచన మేరకు కిషన్ రెడ్డి నాయుడు, పేరవై వర్గాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తెలుగు వర్గాలు ఎన్డీయే వైపు మొగ్గు చూపాయని కిషన్ రెడ్డి ప్రకటించుకున్నారు.

‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య కూటమికి తెలుగు వారు మద్దతు పలకడం శుభపరిణామం.. ఇక్కడున్న మెజారిటీ తెలుగు వారంతా తమిళనాడులో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు.. అన్నాడిఎంకె కూటమిలో మిగతా పార్టీలకు సీట్ల సర్దుబాటు ఇంకా చర్చలు జరుగుతున్నాయి.. మరో రెండు రోజుల్లో ఎన్డీయే కూటమికి సంబంధించిన అన్ని పార్టీల సీట్ల సర్దుబాటు వివరాలు వెల్లడిస్తాము.. ’’ అని కిషన్ రెడ్డి వివరించారు.

కాగా.. సీట్ల సర్దుబాటు విషయంలో అన్నా డిఎంకేకు ఇంకా డిఎండీకేతో ఓ సయోధ్య కుదరడం లేదు. ముందుగా బీజేపీతో సీట్లు సర్దుబాటు చేసుకున్న అన్నా డిఎంకే.. ఆ తర్వాత ఎన్డీయేలోని మిగిలిన పక్షాలతో చర్యలు మొదలు పెట్టింది. డీఎండీకేతో సీట్ల వ్యవహారం సోమవారం (మార్చి 8) నాటికి ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు అన్నా డిఎంకే పార్టీలోను సీట్ల కోసం వర్గ పోరు మొదలైనట్లు కథనాలు ప్రారంభమయ్యాయి. పార్టీలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి ఫళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గ్రూపుల మధ్య అభ్యర్థుల ఎంపిక చిచ్చు రేపింది. అన్నా డిఎంకే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి అవుతున్న సందర్భంలో ఫళనిస్వామి వర్గీయులకు అధికంగా టిక్కెట్లు ఇచ్చారంటూ పన్నీరుసెల్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగ్రహం చెందిన పన్నీరుసెల్వం సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ల భేటీకి పన్నీరు సెల్వం గైర్హాజరయ్యారు. ఆ తర్వాత సీనియర్లతో మంతనాలు కొనసాగించిన ముఖ్యమంత్రి ఫళని స్వామి.. సీనియర్ల సలహా మేరకు పన్నీరు సెల్వంతో అత్యవసర సమావేశానికి సిద్దమయ్యారు. ఈ భేటీ తర్వాత వారిద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే విభేదాల ప్రభావం అన్నా డిఎంకే విజయావకాశాలపై పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తమిళనాడులో తొలిసారి పోటీకి సిద్దమైన హైదరాబాదీ పార్టీ ఎంఐఎం ఆశ్చర్యకరంగా మొన్నటి దాకి బీజేపీ నేతలతో సమాలోచనలు జరిపిన ఏఎంఎంకే పార్టీతో స్నేహం చేస్తున్న సంకేతాలు అందుతున్నాయి. ఏఎంఎంకే అధినేత టిటికే దినకరన్ చేసిన ట్వీట్ ఆధారంగా చూస్తే ఈ రెండు పార్టీలు కలిసి తమిళనాడులో పోటీ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా మూడు అసెంబ్లీ స్థానాలకు ఏఎంఎంకే.. ఎంఐఎం పార్టీకి కేటాయించినట్లు దినకరన్ పార్టీ ఐటీ వింగ్ ట్వీట్ చేశారు. ఏఎంఎంకే పార్టీ సారథ్యంలోని అమ్మ పీపుల్స్ ప్రొగ్రెస్సివ్ లీగ్ కూటమిలో ఎంఐఎం పార్టీ చేరిందని, అలయెన్స్‌లో భాగంగా ఎంఐఎం వాణియంబాడి, కృష్ణగిరి, శంకరపురం అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తుందని ఏఎంఎంకే పార్టీ ఐటీ వింగ్ ట్వీట్‌లో పేర్కొంది. మార్చి 12వ తేదీన చెన్నైలో బహిరంగ సభ నిర్వహణకు మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెడీ అవుతున్నాట్లు ప్రకటించారు.

ALSO READ: ఎట్టకేలకు మహిళా బిల్లుకు మోక్షం.. ఎంపీల డిమాండ్‌కు మోదీ ఓకే

ALSO READ: చట్టాలెన్ని వున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఉపయోగం

ALSO READ: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక

ALSO READ: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

ALSO READ: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!