AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day: చట్టాలెన్ని వున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఉపయోగం..ఎలాగంటే?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ఏ దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత వుంది? అసలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఏంటి? ఓ లుక్కేద్దాం.

International Women's Day: చట్టాలెన్ని వున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఉపయోగం..ఎలాగంటే?
Rajesh Sharma
|

Updated on: Mar 08, 2021 | 5:59 PM

Share

Women representatives need in Statutory bodies: ఆకాశంలో సగం. అవనిలో సగం. ఇలాంటివి కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి మహిళలకు అడుగడుగునా అభద్రతే మిగులుతోంది. యాసిడ్‌ దాడులు, వరకట్నం కేసులు, అపహరణలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. అటు ఆకతాయిలు, ఇంట్లో భర్తలు, పని చేసే చోట సాటి మగ ఉద్యోగులు ఇలా అంతటా అభద్రత భావమే. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. కానీ చట్ట సభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. భారత్‌లోనే కాదు.. చాలా దేశాల్లోను అదే పరిస్థితి. కాకపోతే మనం ఊహించని విధంగా రువాండా వంటి దేశాల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. వారికి చట్ట సభల్లో 63.8 శాతం రిజర్వేషన్లు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. కానీ వాస్తవం అది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ఏ దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత వుంది? అసలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఏంటి? ఓ లుక్కేద్దాం.

అంతర్జాతీయంగా వివిధ దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం సగటు 22 శాతం. మన దేశంలో సగటు ప్రాతినిధ్యం కేవలం 12 శాతం మాత్రమే. రువాండా లాంటి చిన్న దేశంలో చట్టసభల్లో 63.8 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేశారు. ఈకోణంలో ఈ చిన్న దేశం రువాండా ప్రపంచంలో అనేక పెద్ద దేశాల కంటే ఎంతో బెటర్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో చట్టసభల్లో మహిళల సగడు ప్రాతినిధ్యంలో భారత దేశం 103 స్థానంలో వుండడం ఒకింత విచారించాల్సిన విషయం. ఈ విషయంలో ఆసియాఖండంలో మన స్థానం 13. సార్క్‌ దేశాల్లో 5 స్థానం కాగా.. బ్రిక్స్‌ దేశాల్లో 4 వ స్థానంలో హిందుస్తాన్ వుంది. అల్జీరియా, దక్షిణ సుడాన్‌, లిబియా వంటి దేశాల్లో భారత కంటే మెరుగ్గా మహిళలకు స్థానం కల్పిస్తున్నారు. సౌదీ అరేబియా, ఇతర మధ్య-తూర్పు దేశాల్లో కూడా మహిళలకు చట్ట సభల్లో గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తోంది. నేపాల్‌, ఆప్ఘనిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, వియత్నాం, చైనా, పాకిస్థాన్‌, కంబోడియా, బంగ్లాదేశ్‌ కూడా మహిళా ప్రాతినిధ్యంలో ముందంజలో వున్నాయి.

అనేక చట్టాల రూపకల్పనకు వేదికయ్యే చట్ట సభల్లోనే మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే.. వారి రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం చేసే చట్టాల్లో నిజాయితీ ఎంత వుంటుంది? వాటి అమలుకు పకడ్బందీ వ్యవస్థలు ఎక్కడ ఏర్పడతాయి? ఈ ప్రశ్నలను ఎన్నోసార్లు ఎన్నో మహిళా సంఘాలు, సుప్రసిద్ద మహిళలు వ్యక్తం చేశారు. మన దేశ చట్టసభల్లో చేసిన గృహ హింస చట్టం, సమాన ఆస్తిహక్కు, వరకట్న నిషేధం వంటి చట్టాలు ఏళ్ళు గడుస్తున్నా సరిగ్గా అమలు కావడం లేదంటే దానికి కారణం రూపకల్పనలో చిత్తశుద్ది కొరవడడం, అమలు చేసే వ్యవస్థలకు కోరల్లేకుండా చట్టాలు చేయడమేనని చాలా మంది అభిప్రాయం.

నిజానికి భారత దేశ చట్టాల్లో మహిళల రక్షణ కోసం, సంక్షేమం కోసం చేసినవి ఎన్నో వున్నాయి. కానీ గణాంకాలు చూస్తే ఆ చట్టాల అమలు అంతంత మాత్రమేనని అనిపించక మానదు. ఐపీసీ సెక్షన్‌ 100 ప్రకారం మహిళలకు ప్రత్యేక రక్షణ కూడా కల్పించారు. ఆత్మరక్షణకు ఒక వ్యక్తిపైన మహిళ దాడి చేస్తే తప్పులేదు.. ఆ దాడిలో సదరు వ్యక్తి చనిపోయినా ఆ మహిళ నేరం చేసినట్లు కాదు. సెక్షన్‌ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటో, వివరాలు ఇవ్వరాదు. సెక్షన్‌ 354 – మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే. సెక్షన్‌ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే కేసు నమోదు. సెక్షన్‌ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా నేరమే. సెక్షన్‌ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచిఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే 3 నెలలు శిక్ష విధించవచ్చు. పనిచేసే ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు, బాస్‌ ఆఫీసు పనులను అలుసుగా తీసుకొని సెక్స్‌వల్‌ కాంటాక్టు కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే సెక్షన్‌ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం రూపొందించారు. ఒకరికన్నా ఎక్కువ మంది మూకుమ్మడిగాగానీ, గ్రూపులో ఒకరుగానీ ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిపితే ఆ గ్రూపులోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే అవుతాడు. ఐపీసీ సెక్షన్‌ 376-బి కింద అందరికీ శిక్ష పడే అవకాశం వుంది. అత్యాచారం చేసినట్లు నిరూపణ అయితే ఐపీసీ 375 సెక్షన్ ప్రకారం ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం కల్పించారు. మహిళను అవమానపరిచి దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5 నుంచి 7 వరకు జైలు శిక్ష విధించే ఛాన్స్ వుంది. పెళ్లయినా కానట్లు నటించి మహిళలను మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం 7 ఏళ్లు జైలుతోపాటు జరిమానా కూడా విధించేలా చట్టం చేశారు.

వరకట్నం కోసం భార్యను హతమారిస్తే సెక్షన్‌ 302బి ప్రకారం ఏడేళ్ళు జైలు, జీవితఖైదు విధించే అవకాశం వుంది. మహిళను ఒత్తిళ్ళకు గురి చేసి లేదా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపిస్తే సెక్షన్‌ 306 పదేళ్లు జైలుశిక్షతోపాటు జరిమానా విధించేలా చట్టం వుంది. మహిళలను బంధిస్తే ఏడేళ్లు జైలు, జరిమానా, అత్యాచార ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తే సెక్షన్‌ 356 కింద జైలు, జరిమానా, కిడ్నాప్‌ చేస్తే సెక్షన్‌ 363 కింద జైలు శిక్ష విధించేలా సెక్షన్లున్నాయి. బాలికను వ్యభిచార వృత్తికి ప్రేరేపిస్తే సెక్షన్‌ 372 కింద పదేళ్లు జైలు శిక్ష విధించవచ్చు. అత్యాచారానికి పాల్పడితే సెక్షన్‌ 372 కింద పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే సెక్షన్‌ 494 కింద ఏడేళ్ళు జైలు, జరిమానా విధిస్తారు. మొదటి పెళ్ళి దాచి రెండో పెళ్ళి చేసుకుంటే సెక్షన్‌ 495 కింద పదేళ్ళ జైలు శిక్ష విధించేలా చట్టం వుంది.

భర్త, అత్త, మామలు వేధిస్తే సెక్షన్‌ 498ఏ కింద మూడేళ్ళు జైలుశిక్ష పడుతుంది. వరకట్న నిషేధ చట్టం కింద కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరంగానే పరిగణిస్తారు. కానీ ఈ చట్టం అమలైన దాఖలు అత్యంత అరుదు. మహిళలను అవమానపరిస్తే సెక్షన్‌ 509 కింద ఏడాది జైలుశిక్ష పడుతుంది. పెళ్ళి చేసుకుంటానని శృంగారం చేసినా, సెక్స్ చేసి మోసి చేసినా సెక్షన్‌ 493 కింద పదేళ్ళు జైలు, జరిమానా పడుతుంది.

ఇన్ని పకడ్బందీ చట్టాలు చేసినట్లు పైకి కనిపిస్తున్నా వీటి ద్వారా శిక్షకు గురైన వారి సంఖ్య ఇలాంటి నేరాలకు పాల్పడే వారి సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. దానికి కారణం ఆయా చట్టాల్లోనే లోపాలుండడమని పలువురు మహిళా సంఘాల నేతలు, మహిళా లాయర్లు అభిప్రాయపడుతుంటారు. చట్టాలు చేసేపుడు మహిళల తరపున అన్ని అంశాలను సభ్లోల ప్రస్తావించి, తద్వారా వారు లేవనెత్తిన లొసుగులను అడ్రస్ చేస్తూ చట్టాలు తయారు చేస్తే.. అపుడు మహిళలపై అకృత్యాలకు, నేరాలకు పాల్పడే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని వారంటూ వుంటారు. చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే.. వారి రక్షణ కోసం రూపొందించే చట్టాల్లో లోపాలు అలాగే వుంటాయన్నది వారి అభిప్రాయం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే మహిళల రక్షణకు పకడ్బందీ చట్టాలు వస్తాయనడానికి ఇటీవల తెచ్చిన నిర్భయ చట్టమే ఉదాహరణ అంటున్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత, దాన్ని మరింత పక్కా మారుస్తూ పోక్సో చట్ట రూపకల్పన జరిగిన తర్వాత కూడా మహిళల పట్ల ఎన్నో అకృత్యాలు జరగడమే అందుకు నిదర్శనమంటున్నారు.

ALSO READ: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక

ALSO READ: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

ALSO READ: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!