AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ గ్రామానికి రక్షకులు ఆ పక్షులే… సెక్యూరిటీ గార్డుల్లా కాపలా..!

హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. గ్రామాల్లోకి పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు లాంటి విష పురుగులు గ్రామంలోకి వచ్చి ప్రజల్ని కాటువేస్తున్నాయి.

Andhra Pradesh: ఆ గ్రామానికి రక్షకులు ఆ పక్షులే... సెక్యూరిటీ గార్డుల్లా కాపలా..!
Peacocks
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 24, 2024 | 8:01 PM

Share

అవన్నీ అడవికి దగ్గరగా ఉండే కుగ్రామాలు. పాములు, తేళ్ళు లాంటి విష పురుగులు ఆ గ్రామల్లోకి చొరబడి పిల్లా-పెద్దా అన్న తేడా లేకుండా కాటు వేస్తుంటాయి. వైద్యం అందితే ప్రాణాలతో బయటపడతారు. అందకపోతే హరి అనాల్సిందే..! కానీ గత పదేళ్ళుగా ఆ గ్రామాల్లో రక్షణ దళం ఒకటి తయారైంది. నిత్యం ఆ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతుందా దళం. ఒక్క విష పురుగు కూడా గ్రామంలో రాకుండా కాపలాకాయడం మొదలుపెట్టారు..! ఇంతకీ రక్షకులు.. విష పురుగుల బారి నుంచి గ్రామాన్ని ఎలా కాపాడుతున్నారు.. తెలుసుకోవలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

ప్రకాశం జిల్లా వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లోని అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు గత పదేళ్ళుగా నెమళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ప్రజలతో మమేకమై వారితో కలిసి జీవిస్తున్నాయి. గ్రామంలోకి అటవీ ప్రాంతాల నుంచి వచ్చే పాములు, కీటకాలు, విష పురుగులను గుర్తించి స్వాహా చేస్తున్నాయి. దీంతో గ్రామస్థులు తమకు రక్షణగా ఉన్న నెమళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

గ్రామం బయటనుంచి ఎవరైనా వచ్చి నెమళ్ళను వేటాడాలని ప్రయత్నిస్తే దేహశుద్ది చేసి పంపిస్తున్నారు. వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి, కట్టకిందపల్లి గ్రామాలు, హనుమంతునిపాడు మండలం మంగంపల్లి గ్రామాల్లో ఇప్పుడు జాతీయ పక్షి నెమళ్ళే రక్షణ కవచాలు అంటే అతిశయోక్తి కాదు…!

హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. గ్రామాల్లోకి పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు లాంటి విష పురుగులు గ్రామంలోకి వచ్చి ప్రజల్ని కాటువేస్తున్నాయి. దీంతో గ్రామంలో రాత్రి సమయంలో సంచరించాలంటే ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే గ్రామంలోని కొందరు యువకులు పశువులను మేపుకునేందుకు కొన్నేళ్ళ క్రితం అడవికి వెళ్లారు. అక్కడ వారికి ఓ ఐదు గుడ్లు కనిపించాయి. చూడటానికి పెద్దవిగా వుండటంతో వాటిని తీసుకువచ్చి గ్రామంలోని కోళ్ళ చేత పొదిగించారు. గుడ్లు పొదిగి నెమలి పిల్లల రూపంలో బయటకు వచ్చాయి.

మొదట వాటిన చూసిన గ్రామస్థులు భయపడ్డారు. నెమలి పిల్లలను గ్రామంలో పెంచితే అటవీశాఖాధికారులతో ఇబ్బందులు కలుగుతాయేమోనని భావించారు. ఐదు నెమలి పిల్లలు కాలక్రమంలో పెరిగి పెద్దవయ్యాయి. ఐదు కాస్త పదుల సంఖ్యకు చేరుకున్నాయి. గ్రామంల్లోనే సంచరిస్తూ గ్రామంలోకి ప్రవేశించే పాము, తేళ్ళు, కాలజెర్లు, మండ్రగబ్బల లాంటి హాని కలిగించే వాటి భరతం పట్టడం ప్రారంభించాయి.

ఇక, అంతే గ్రామంలో ఓ చిన్న విష పురుగు జాడ కూడా కనిపించలేదు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి గ్రామస్థులు వాటిని కన్న బిడ్డల్లా, కంటికి రెప్పల్లా చూసుకోవడం ప్రారంభించారు. వాటికి సమయానికి దాన్యం గింజలను ఆహారంగా అందిస్తూ వాటి ఆలనపాలనా చూడసాగారు. అదే విశ్వాసంతో నెమళ్ళు కూడా అడవి మార్గం పట్టకుండ గ్రామంలోనే సంచరిస్తూ విష పురుగులు గ్రామంలోకి రాకుండా సెక్యూరిటీ గార్డుల్లా కాపలాకాస్తున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..