Google Map: గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి.. ముగ్గురు స్పాట్ డెడ్!
గుడ్డిగా గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ కారులో అతి వేగంగా పెళ్లికి బయల్దేరారు ఆ ముగ్గురు.. కానీ అంతేవేగంగా క్షణాల్లో యమలోకానికి చేరారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆదివారం చోటు చేసుకుంది..
బరేలీ, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆదివారం (నవంబర్ 24) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్ గుడ్డిగా నమ్మిన ముగ్గురు వ్యక్తులు కారు డ్రైవ్ చేసుకుంటూ.. నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి అమాంతం నదిలో పడిపోయారు. అంత ఎత్తునుంచి కారు ఒక్కసారిగా రామగంగా నదిలో పడిపోవడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. బాధితులు బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటాగంజ్‌కు ప్రయాణిస్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న బరేలీలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్, బదౌన్‌లోని డేటాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారును నదిలో నుంచి బయటకు తీశారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే..
ఈ ప్రమాదం GPS నావిగేషన్ వల్ల జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వంతెన అసంపూర్తిగా ఉన్న విషయం కారులో ప్రయాణిస్తున్న వారికి తెలియదు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడం.. ఆ వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలియని బాధితులు జీపీఎస్ మ్యాప్ ప్రకారం బ్రిడ్జిపై వేగంగా కారులో వెళ్తున్నారు. దీంతో వంతెనపై నుంచి కారు కిందకు పడిపోయింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీ సాయంతో కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద వార్త విన్న చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
उत्तर प्रदेश में गलत GPS लोकेशन से गई 3 जानें !! https://t.co/x9XU6Fo6F9 pic.twitter.com/AYOkaWCPNN
— Sachin Gupta (@SachinGuptaUP) November 24, 2024
కాగా.. మనం కూడా తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు తరచు గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తుంటాం. ఈ ప్రమాదంలో కూడా కారులో ఉన్న యువకులు గూగుల్ మ్యాప్ సహాయంలో బంధువుల పెళ్లికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్‌లో రాంగ్ రూట్ చూపడం వల్ల వారి కారు బ్రిడ్జిపై నుంచి పడి ముగ్గురి మృతికి కారణమైంది. మృతువ వివరాలు ఇంకా తెలియరాలేదు.