Hyderabad: మద్యం కిక్కులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. అర్ధరాత్రి హల్‌చల్! ఎక్కడంటే?
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి ఓ మందు బాబు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఫూటుగా మందుకొట్టి స్కూటీపై వస్తున్న సదరు వ్యక్తిని ఆపడంతో తెగ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చొక్కా గుండీలు విప్పీ బూతులు తిడుతూ నానాయాగి చేశాడు. అతడిని అదుపు చేయడానికి ట్రాఫిక్ సిబ్బందికి తల ప్రాణం తోకకొచ్చిందంటే అతిశయోక్తి కాదు..
హైదరాబాద్, నవంబర్ 24: ఫూటుగా మందు కొట్టిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సదరు మందుబాబు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో శనివారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్చౌక్ పోలీసుల బృందం చంపాపేట్ వద్ద అతన్ని ఆపింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అతగాడు దొరికిపోయాడు. పోలీసులు అతడి స్కూటీని సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. సదరు మందు బాబు పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. చొక్కా గుండీ విప్పి రచ్చరచ్చ చేశాడు. దౌర్జన్యం చేసి రోడ్డుపై నానాబీభత్సం సృష్టించాడు. దీంతో చుట్టూ చేరిన ట్రాఫిక్ సిబ్బంది అతడిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతగాడిని ఎత్తిపట్టి మరోచోటికి తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో సదరు మందుబాటు చేతిలో పెద్ద బండరాయి తీసుకుని పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి తన స్కూటీకి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.