నా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు.. 44 ఏళ్ల క్రితం నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నః రంగనాథ్
వాస్తవాలు ఇలా వుంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని రంగనాథ్ మండిపడ్డారు.
తన ఇంటి విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ మధురానగర్‌లో తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఇల్లు విషయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు రంగనాథ్. 44 ఏళ్ల క్రితం వారి నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది ఇళ్ళ తర్వాత మా యిల్లు ఉంది. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. కృష్ణకాంత్ పార్క్ దాటిన తర్వాత వేలాది ఇళ్లు ఉన్నాయి. 44 ఏళ్ల క్రితం తమ తండ్రి ఇంటిని నిర్మించినట్లు రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే ఇరిగేషన్ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిధిలోకి రావన్న రంగనాథ్.. చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని స్పష్టం చేశారు.
వాస్తవాలు ఇలా వుంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని రంగనాథ్ మండిపడ్డారు. మా నాన్న ఎ.పి.వి.సుబ్బయ్య 1980 సంవత్సరంలో ఈ ఇంటిని నిర్మించారని ఆయన తెలిపారు. 44 సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో తండ్రితో కలిసి ఉంటున్నామని తెలిపారు. సంస్కృతి/సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద, కట్టను ఆనుకొని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందే..!
తాము నివాసం వుంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందని రంగనాథ్ వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. తాము ప్రస్తుతం నివాసం వుంటున్న ఇల్లు బఫర్ జోన్‌లో లేదు అనేది వాస్తవం అనేది అందరూ గ్రహించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..