TGPSC గ్రూప్‌ 1 ‘కీ’పై సుప్రీంకోర్టులో పిటిషన్‌.. తెలుగు అకాడమీ పుస్తకాలు కాదనీ గూగుల్‌, వికీపీడియా ఆధారంగా ‘కీ’ తయారీపై ఆగ్రహం

టీజీపీఎస్సీ వ్యవహారం గోడ మీద పిల్లిలా తయారైంది. ఒంటెద్దు పోకడలతో నిరుద్యోగులు జీవితాలతో ఆటలాడుతుంది. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను పక్కకునెట్టి గూగుల్, వికీపీడియా ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 పరీక్ష కీ తయారు చేసామని చెప్పడం నిరుద్యోగుల్లో ఆగ్రహం పుట్టిస్తుంది.. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు?

TGPSC గ్రూప్‌ 1 'కీ'పై సుప్రీంకోర్టులో పిటిషన్‌.. తెలుగు అకాడమీ పుస్తకాలు కాదనీ గూగుల్‌, వికీపీడియా ఆధారంగా ‘కీ’ తయారీపై ఆగ్రహం
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 25, 2024 | 6:46 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 25: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు కూడా ముగిశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. అయితే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీపై అభ్యర్ధులు ఇంకా న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ వైపు హైకోర్టులో పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే జీవో-29పై సుప్రీంకోర్టుకెళ్లిన అభ్యర్థులు.. ఇప్పుడు ప్రిలిమ్స్ ఫైనల్‌ ‘కీ’పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఫైనల్‌ కీలో అనేక తప్పులు దొర్లాయని, తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడంలేదని నిరుద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్‌ మోహిత్‌రావు ఈ మేరకు న్యాయం కోరుతూ పిటిషన్‌ వేశారు. ఈ కేసు సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

అసలేంటీ వివాదం..?

గ్రూప్‌ 1 ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేయగా 1,712 మంది అభ్యర్థుల నుంచి 6,417 అభ్యంతరాలొచ్చాయి. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌లో ప్రశ్న నెంబర్‌ 56, 59ని తొలగించారు. ప్రశ్న నెంబర్‌ 115కు సరైన సమాధానం ఆప్షన్‌ 2 నుంచి ఆప్షన్‌ 1కు మార్చారు. ఈ మూడు ప్రశ్నలు మినహా మిగతావాటి గురించి టీజీపీఎస్సీ పెదవివిప్పలేదు. అభ్యర్థులు మాత్రం మొత్తం 13 ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు లేవదీశారు. ప్రశ్న నెంబర్లు 35, 41, 45, 59, 64, 66, 67, 79, 95, 106, 116, 119, 139పై అభ్యంతరాలు వ్యక్తంచేసినప్పటికీ.. వాటన్నింటినీ కమిషన్‌ సరైన ప్రశ్నలుగా పరిగణించింది. దీనిపై హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి.. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని కోర్టుముందుంచారు అభ్యర్ధులు. దీనిపై విచారణ సమయంలో టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదని హైకోర్టుకు తెలిపింది. బదులుగా గూగుల్‌, వికీపీడియాను ప్రమాణికంగా తీసుకుని ‘కీ’ని ఖరారుచేసినట్టు టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ సంస్థ ముద్రించిన పుస్తకాలు ప్రమాణికంకాదనడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

ఇక హైకోర్టులో గ్రూప్‌ 1పై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయి. ఓ వైపు హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే, మరో వైపు సుప్రీంకోర్టులోనూ పోరాటానికి సిద్ధమయ్యారు నిరుద్యోగులు. జీవో 29 సహా ఫైనల్‌ ‘కీ’పై గల కేసుల్లో న్యాయం తమవైపే ఉందని, 2 కోర్టుల్లోనూ తమకు అనుకూలంగా తీర్పువస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.