AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Super Kings: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!

చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యరీతిలో టెస్టు ప్లేయర్, ది వాల్‌గా పేరుగాంచిన చటేశ్వర్ పుజారాను కొనుగోలు చేసింది. అతని బేసిక్ ప్రైస్ రూ.2 కోట్లకే అతన్ని సీఎస్కే కొనుగోలు చేసింది. నత్తనడకన ఆడే పుజారాను ఫటాఫట్ ఆటకు ఎంపిక చేయడమేంటా?

Chennai Super Kings: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!
Rajesh Sharma
|

Updated on: Mar 08, 2021 | 3:55 PM

Share

CSK Strategy behind Pujara Selection: మొన్నీమధ్యే ముగిసినట్లు అనిపించిన ఐపీఎల్ పొట్టి క్రికెట్ టోర్నీ మరో నెల రోజుల్లో మరోసారి ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా గతేడాది రీషెడ్యూల్ అయి.. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 ప్రేక్షకులు లేకపోయినా అలరించింది. అయిదు నెలల గ్యాప్‌లోనే మరోసారి ఐపీఎల్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మళ్ళీ ప్రారంభం కాబోతోంది. నవంబర్ 10, 2020న ఐపీఎల్ ఫైనల్ జరిగింది. సరిగ్గా అయిదు నెలల వ్యవధిలోనే ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగబోతోంది. 2021 ఐపీఎల్ ఏప్రిల్ 9న చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయ్ ఇండియన్స్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదుర్కోబోతోంది. అయితే.. వచ్చే టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాటెజీపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఈసారి ఆటగాళ్ళ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యరీతిలో టెస్టు ప్లేయర్, ది వాల్‌గా పేరుగాంచిన చటేశ్వర్ పుజారాను కొనుగోలు చేసింది. అతని బేసిక్ ప్రైస్ రూ.2 కోట్లకే అతన్ని సీఎస్కే కొనుగోలు చేసింది. నత్తనడకన ఆడే పుజారాను ఫటాఫట్ ఆటకు ఎంపిక చేయడమేంటా అని పలువురు ఆశ్చర్యపోయారు. ఇందులో సీఎస్కే యాజమాన్యానిది గానీ.. కెప్టెన్ ఎంఎస్ ధోనీదిగానీ ఏదైనా వ్యూహం వుందా అన్న అంశంపై చర్చ జరిగింది. పుజారాను తీసుకోవడం వెనుక చెన్నై వ్యూహంపై తాజాగా కథనాలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఎవరైనా జట్టులోకి వస్తే అతన్ని ఎందుకు తీసుకున్నారనే చర్చ, మంచి ఆటగాడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించకపోతే అది ఎందుకు జరిగిందనే వాదన కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చటేశ్వర్‌ పుజారా గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. సీఎస్‌కే పుజారాను కొనుగోలు చేయడానికి కారణం ఏమిటనే కుతూహలం అభిమానుల్లో చర్చకు తెరలేపింది. పుజారా టెస్ట్ ప్లేయర్.. చాలా స్లోగా ఆడతాడు.. మరి అలాంటి స్లో ప్లేయర్‌ని చెన్నై జట్టు ఎందుకు కొనుగోలు చేసింది? ఈ ప్రశ్న సీఎస్కే అభిమానుల్లో నానుతోంది. అయితే తాజాగా వెల్లడవుతున్న అభిప్రాయాలను పరిశీలిస్తే.. సీఎస్కే వ్యూహాత్మకంగానే పుజారాను కొనుగోలు చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సీఎస్కే కెప్టెన్ ధోనీ.. అయిదో లేదా ఆరో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడన్న విషయం అందరికి తెలిసిందే. అయితే.. అప్పటి దాకా రెగ్యులర్ బ్యాట్స్‌మన్ ఒక్కరు మిగలకపోతే ధోనీ హిట్ ప్లే‌కు సహకారమందించే బ్యాట్స్‌మన్ కరువు అవుతున్నాడు. దాంతో ఓపెనర్లు లేదా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగుకు దిగే అంబటి రాయుడుపైనే భారమంతా పడుతోంది. టాప్ ఆర్డర్ వెంటవెంటనే కుప్పకూలితే ఇన్నింగ్స్‌కు గాడిలో పెట్టి.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ధోనీకి సహకారమందించే బ్యాట్స్‌మన్ అవసరమని సీఎస్కే థింక్ ట్యాంక్ భావించడం వల్లనే పుజారాను బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే 2014లో చివరి సారి ఐపీఎల్ ఆడిన పుజారా.. ఆ తర్వాత పొట్టి ఫార్మెట్‌లో ఎక్కడా ఆడిన దాఖలాలు లేవు. అయితే.. ఇటీవలి ఆస్ట్రేలియా టూర్‌లో రెండో టెస్టు గెలిచిందంటే పుజారా లెంగ్తీ ఇన్నింగ్స్‌ కూడా ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి. దాంతో పుజారా విలువైన ఆటగాడిగా జట్టులో గుర్తింపు పొందాడు.

ఇటువైపు గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఫేలవమైన ప్రదర్శన చేసింది. మొత్తం పద్నాలుగు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఆరు మ్యాచుల్లో గెలిచి.. 8 మ్యాచుల్లో ఓడి.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు చేసింది. మూడు సార్లు (2010, 2011, 2018) ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టుకు మొదట్నించీ ధోనీయే సారథి. దుబాయ్‌లో జరిగిన 2020 ఐపీఎల్‌లో జట్టు చెత్త ప్రదర్శన చేయడంతో ధోనీకి సీఎస్కే యాజమాన్యం ఉద్వాసన పలుకుందన్న కథనాలు వచ్చాయి. ఆ కథనాలకు జట్టు యాజమాన్యం ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టింది. ధోనీయే 2021 సీజన్‌ను చెన్నై సారథి అని ప్రకటించి.. ఊహాగానాలకు చెక్ పెట్టింది. అయితే.. దీనికి కారణాలు కూడా రకరకాలుగా వినిపించాయి. నవంబర్ 10, 2020న ఐపీఎల్ 2020 ఫైన్ మ్యాచ్ జరగ్గా.. కేవలం అయిదు నెలల వ్యవధిలోనే నెక్స్ట్ సీజన్‌ ప్రారంభం కానుండడంతో కెప్టెన్‌ని మార్చడం రిస్క్ అని మేనేజ్‌మెంటు భావించడం వల్లనే ధోనీని కూడా 2021 సీజన్‌లోను కొనసాగించినట్లు చెప్పుకుంటున్నారు.

ధోనీ ఇదివరకే టీమిండియాకు దూరమయ్యాడు. అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్ అయ్యాడు. అయితే.. కొంత కాలం ఐపీఎల్ కొనసాగాలని అతను భావించాడు. అందులో భాగంగానే సీఎస్కే కెప్టెన్‌గా గత సీజన్‌లో కొనసాగాడు. అయితే.. అత్యంత ఫేలవమైన ప్రదర్శన తర్వాత ధోనీ స్వయంగా ఐపీఎల్‌ను వీడడంగానీ.. లేక యాజమాన్యమే అతన్ని తప్పించడం గానీ జరుగుతాయని పలువురు భావించారు. కానీ.. వీటన్నింటికీ చెక్ పెడుతూ సీఎస్కే మేనేజ్‌మెంటు ధోనీకి మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ ఛాన్సును చక్కగా వినియోగించుకునేందుకు తనకు ఎలివేషన్ వచ్చేందుకు తనకు సహకరించే బ్యాట్స్‌మన్ అవసరమని ధోనీ భావించాడని అనుకుంటున్నారు. అందుకే పుజారా ఎంపిక జరిగిందంటున్నారు. తానేంటో సత్తా చాటుకోవాలంటే తనకు నిలకడగా సహకరించే బ్యాట్స్‌మన్ అవసరమని ధోనీ భావించి.. అందుకే పుజారాను ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు 2021 సీజనే ధోనీకి లాస్ట్ ఐపీఎల్ కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి మరోసారి ట్రోఫీని అందించి.. ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకుంటాడన్న అంఛనాలు కూడా వినిపిస్తున్నాయి.

ALSO READ: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు