Bengal Polls: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఆపరేషన్ ఆకర్ష్. ఇదివరకే రెండు దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మమతా బెనర్జీని ఇంటికి…

  • Rajesh Sharma
  • Publish Date - 2:34 pm, Mon, 8 March 21
Bengal Polls: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

Bengal BJP’s Operation Akarsha: బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఆపరేషన్ ఆకర్ష్. ఇదివరకే రెండు దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మమతా బెనర్జీని ఇంటికి పంపడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కమలాకర్ష్‌ని చేపట్టింది. ఈ ఆపరేషన్ దాదాపు ఏడాది క్రితమే మొదలైనా గత రెండు నెలలుగా ఊపందుకున్నది. ఈ వలసలు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయ్యే వరకే అనుకున్న వారికి షాకిస్తూ.. ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఆశ్చర్యపరిచే అంశమేంటంటే.. ఒక పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కిన తర్వాత కూడా అభ్యర్థులు పార్టీ మారుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బెంగాల్‌లో బీజేపీ కొనసాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

మొన్నటి వరకు అధినేత్రి మమతాబెనర్జీకి చేదోడు వాదోడుగా వున్న వారు సైతం ఇపుడు పార్టీ మారుతున్నారు. మరికొందరైతే బెంగాల్ హింసను అరికట్టలేకపోయామంటూ మమతకు షాకిచ్చే కామెంట్లు చేసి మరీ పార్టీ వీడుతున్నారు. ఇంకోవైపు మరికొందరైతే చట్టసభల్లో నిరసన వ్యక్తం చేసి మరీ ఆ తర్వాత కొంతకాలానికి పార్టీ మారుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలైన సోనాలి గుహకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆమె బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తృణమూల్ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోనాలి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన సూచన మేరకు కమలం పార్టీలో చేరుతున్నానని సోనాలి వెల్లడించారు. బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా అయిన సోనాలి.. తృణమూల్ కాంగ్రెస్‌లో తనకు గౌరవం లేదని. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని అన్నారు. తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె కన్నీరు పెట్టుకోవడం విశేషం. ఇటీవల అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో తమకు తగిన స్థానం లభించలేదని కొందరు, ఈ ఎన్నికల్లో టికెట్ లభించక కొందరు ఇలా పలువురు పార్టీని వీడారు.

ఇలా పార్టీ మారి బీజేపీ పంచన చేరిన వారిలో ఒకప్పటి దీదీ సహచరుడు సువేందు అధికారి ఒకరు. ఆయనైతే పార్టీ మారడంతోపాటు తనపై నందిగ్రామ్‌లో పోటీకి రావాలంటూ దీదీకి సవాల్ విసిరాడు. ఆయన సవాల్‌ను అంగీకరిస్తూ మమతాబెనర్జీ తన పాత సీటును వదిలేసి నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్దమయ్యారు. మరోవైపు రాజ్యసభలోనే సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విధానాలను తప్పుపట్టి.. సభలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన దినేశ్ త్రివేది కూడా ఇటీవల బీజేపీ గూటికి చేరారు. టీఎంసీని వీడిన తర్వాత తానెంతగానో రిలీఫ్ ఫీలవుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్ జాతీయ స్థాయిలో సంచలనమైంది. టీఎంసీలో అంతగా నియంతృత్వ విధానాలు ఉన్నాయా అన్న చర్చ మొదలైంది త్రివేది ప్రకటన తర్వాత. తాను నిర్వహించిన రైల్వే శాఖను ఆమె ముఖ్యమంత్రి కాగానే వదిలేసి.. దాన్ని త్రివేదికి ఇచ్చారు మమతా బెనర్జీ 2011లో. అయితేనేం ఆమె ఆధిపత్య ధోరణి నచ్చక ఇపుడు ఆయన పార్టీని వీడారు. దీదీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తున్నారు.

ఇక ఒకప్పుడు టీఎంసీ తరపున ఎంపీగా వ్యవహరించిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ నుంచి సీపీఎం పార్టీలోకి వెళ్ళిన మిథున్ చక్రవర్తి.. గత కొంత కాలంగా రాజకీయాల నుంచి దూరంగా వున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన మీదట ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. భారత క్రికెట్‌కు ఆటగాడిగా సేవలందించి.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షునిగా పని చేస్తున్న సౌరవ్ గంగూలీని కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. అయితే.. ఆయన ఇటీవల రెండు సార్లు గుండె నొప్పితో బాధపడిన నేపథ్యంలో ఆయనపై అంతగా ప్రెషర్ చేయవద్దన్న జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక పార్టీ టిక్కెట్ తీసుకుని ఇంకో పార్టీలోకి జంప్ అవడం. బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య పోటీ రసవత్తరంగా మారిందనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం పలువురు ఎదురుచూస్తుంటారు. హబీబ్‌పుర్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు సరళ ముర్ము అనే లోకల్ లీడర్‌కు దీదీ టిక్కెట్ ఇచ్చారు. అయితేనేం ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. సరళ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. మార్చి 5న ఎన్నికల్లో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను టీఎంసీ ప్రకటించింది. అందులో సరళ పేరు కూడా ఉంది. మాల్డా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా అమె గతంలో విధులు నిర్వర్తించారు. కారణాలేవైతేనేం.. ఆమె పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. తాజా పరిణామంపై తృణమూల్ స్పందించింది. హబీబ్‌పుర్ నియోజక వర్గం అభ్యర్థిని వెంటనే మార్చేసింది. ప్రదీప్‌ బాస్కీని కొత్త అభ్యర్థిగా ప్రకటించింది. ముందు ప్రకటించిన అభ్యర్థి అనారోగ్య కారణాల వల్ల ఆమెను మార్చినట్లు టీఎంసీ వెల్లడించింది. అయితే ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఎవరు వెళ్లినా తమకు నష్టం లేదంటున్నారు. ఇది వారి వారి సొంత నిర్ణయమని, పార్టీలోనే కొనసాగవలసిందిగా తాము ఎవరినీ బలవంత పెట్టే ప్రసక్తి లేదని దీదీ అంటున్నారు.

ALSO READ: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!